హారిస్ షీల్డ్ ప్రచారకర్తగా సచిన్!
ముంబై: హారిస్ షీల్డ్ ట్రోఫీ... ముంబై స్కూల్ క్రికెట్లో సంచలనాలకు వేదికైన టోర్నీ. 1988లో ఈ టోర్నీలో భాగంగానే శారదాశ్రమ్ విద్యామందిర్ పాఠశాల తరఫున ఆడుతూ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు ఆ టోర్నీకి మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే సచిన్‌కు తెలియజేయగా, అతను సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. రిటైర్మెంట్ తర్వాత ప్రాథమిక స్థాయి క్రికెట్‌కు తన సహకారం అందించేందుకు సచిన్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడని ముంబై స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫాదర్ జూడ్ రెడ్రిగ్స్ వెల్లడించారు.
‘హారిస్ షీల్డ్ టోర్నీని చరిత్రలో భాగం చేసిన ఘనత సచిన్‌దే. ఈ టోర్నీకి ప్రచారకర్తగా ఉండాలని మేం ఇప్పటికే చెప్పాం. ఇది 99 శాతం ఓకే అయినట్లే. అతను మాతో కలిసి పని చేస్తే అది మాకెంతో గర్వకారణం’ అని ఆయన అన్నారు. 11 ఏళ్ల వయసులో తొలిసారి హారిస్ షీల్డ్ టోర్నీ ఆడిన సచిన్ ఈ టోర్నీలో మొత్తం ఏడు సెంచరీలు నమోదు చేశాడు. ప్రపంచ రికార్డు భాగస్వామ్యంలో సచిన్ 326 పరుగులతో, కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
రంజీ బరిలో...
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ముంబై తరఫున రంజీట్రోఫీ మ్యాచ్ కూడా ఆడాలని సచిన్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 27 నుంచి 30 వరకు లాహ్లిలో హర్యానాతో జరిగే మ్యాచ్‌లో మాస్టర్ బరిలోకి దిగుతాడు. సచిన్‌తోపాటు జహీర్‌ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆడతాడని ముంబై టీం మేనేజ్మెంట్ వెల్లడించింది.