మాల్యా కావాలనే వేలకోట్లు ఎగ్గొట్టాడు!
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ విషయంలో మాల్యాను ఉద్దేశపూర్వక నేరస్తుడిగా ముంబై స్పెషల్ కోర్టు మంగళవారం ప్రకటించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్ పారిపోయిన మద్యం వ్యాపారి మాల్యా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాకివ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తుల అటాచ్ మెంట్ (స్వాదీనం) కు ముందే గుట్టు చప్పుడు కాకుండా తన ఆస్తులను మాల్యా మంచి ధరకు అమ్మేశాడు.
భారత్ కు తిరిగా రావాలని, లొంగిపోవాలని మాల్యాకు కోర్టు సూచించినా పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం చెప్పిన ప్రాంతంలో, చెప్పిన సమయానికి ముప్పై రోజుల్లోగా హాజరుకావాలి, కానీ అలా చేయని పక్షంలో ఏ వ్యక్తిని అయినా ఉద్దేశపూర్వక నేరగాడిగా పేర్కొంటారని తన ఆదేశాలలో పేర్కొంది. ఆస్తులు స్వాధీనం చేసుకోకముందు అతడు ప్రాపర్టీస్ ను అమ్మేశాడని ఈడీ తరఫు న్యాయవాది నితిన్ వెనిగోంకార్ తెలిపారు. ఇంటర్ పోల్ ను సంప్రదించి మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు అందజేసే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ అరెస్ట్ వారెంటు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు మాల్యా మాత్రం.. తాను రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటున్నా, ఈడీ మాత్రం అన్ని దారులు మూసేసిందని ఆరోపించారు. లోన్ రికవరీ అనేది సివిల్ కేసు అని, దర్యాప్తు ఏకపక్షంగా చేసి దానిని క్రిమినల్ కేసుగా మార్చారని విమర్శించిన విషయం తెలిసిందే.