ముంబైకర్ల మానవత్వం.. పాక్ బాలికకు సాయం
ఒకవైపు బుసలు కొట్టే ద్వేషం.. మరోవైపు మానవీయ హృదయం.. తాత్కాలికంగా ఆవేశ కావేషాలకు లోనైనా, సహజంగా భారతీయులు సహృదయులనే విషయం మరోసారి రుజువైంది. అరుదైన వ్యాధికి గురై.. పాకిస్థాన్ నుంచి వచ్చిన బాలికకు చికిత్సకు అవసరమైన దాదాపు 17 లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించి ఇచ్చి, ఆమెకు బ్రహ్మాండమైన చికిత్స చేయించి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారిన తర్వాత తల్లీకూతుళ్లను విమానం ఎక్కించి వాళ్ల స్వదేశానికి పంపారు. 49 రోజుల పాటు భారతీయులు తమ పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ఆ తల్లీకూతుళ్లు ఉప్పొంగిపోయారు.
కరాచీకి చెందిన సబా తారిఖ్ అహ్మద్ అనే 15 ఏళ్ల అమ్మాయికి విల్సన్స్ డీసీజ్ సోకింది. దాని కారణంగా శరీరంలో విషపూరితమైన కాపర్ నిల్వలు పెరిగిపోతాయి. ఆమెకు ముంబైలోని ప్రఖ్యాత జస్లోక్ ఆస్పత్రిలో స్థానికుల విరాళాలతో చికిత్స చేయించారు. ఏప్రిల్ నెలలో ఒకసారి, అక్టోబర్లో మరోసారి ఆమె చికిత్సకు అవసరమైన సొమ్మును స్థానికులు సేకరించి ఇచ్చారు.
తొలిసారి బ్లూబెల్స్ కమ్యూనిటీ అనే స్వచ్ఛంద సంస్థ ముంబైకర్ల సాయంతో 7 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఆ చికిత్స సరిపోలేదు. దాంతో చికిత్స మార్పుతో పాటు ఫిజియోథెరపీ కూడా చేయించాల్సి వచ్చింది. కరాచీ వెళ్లాక ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. మరింతమంది ముందుకొచ్చి.. ఆన్లైన్ ద్వారా విరాళాలు తీసుకుని 10 లక్షలు సేకరించి ఆమెకు చికిత్స చేయించారు. దాంతో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి స్వదేశానికి వెళ్లింది.