17ఏళ్ల సర్వీసు...25 రూ.జీతం
శ్రీనగర్: భారత్ వెలిగిపోతోందని మురిసిపోయే వారికి షాకింగ్ న్యూస్. పేదలకు అచ్ఛేదిన్ అని ప్రగల్భాలు పలికే పాలకులకు ఇదొక చెంపపెట్టులాంటి వార్త. జమ్ముకశ్మీర్‌లోని ఒక ప్రభుత్వ స్కూలులో చౌకీదార్‌గా (స్వీపర్) పనిచేసి రిటైరైన మహ్మద్ సుభాన్ వాని (64)కథ వింటే ఎవరికైనా ఇలాగైనా అనిపిస్తుంది. స్కూలు నిర్మాణం కోసం భూమిని వదులుకోవడం, దానికి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన పరిహారం ఇప్పటివరకు రాకపోవడం ఒకటైతే, సుదీర్ఘకాలం ఆ స్కూలు కోసం సేవ చేసినా నెలకు పాతిక రూపాయల జీతంతోనే రిటైరవ్వడం మరో విషాదం. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ పాఠశాల కోసం తన సొంత స్థలాన్ని వదులుకున్న మహమ్మద్, అదే స్కూల్లో 1988లో నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. పదిహేడేళ్ల పాటు కేవలం 25 రూపాయల జీతంతో పనిచేశాడు. జీతం పెంచమని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యం. చివరికి ఆ జీతంతోనే 2005 లోఉద్యోగం విరమణ కూడా చేశాడు.
పొలంలోని చెట్ల ద్వారా వచ్చే మంచి ఆదాయాన్ని వదులుకుని మరీ స్కూలు కోసం తన భూమి ఇచ్చినట్లు మహమ్మద్ తెలిపాడు. తనకు చదువు అంతగా రాదని, ప్రభుత్వం తనను మోసం చేస్తుందని అనుకోలేదని అతడు వాపోతున్నాడు. న్యాయం కోసం ఎక్కని ఆఫీసు గుమ్మం లేదు, కలవని ఆఫీసర్ లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ స్కూలు కోసం, బంగారంలాంటి తన భూమిని వదులుకున్నాడో.. ఆరోజే తన బిడ్డల భవిష్యత్తును బుగ్గిపాలు చేశానని మహమ్మద్ ఇప్పుడు కలత చెందుతున్నాడు. న్యాయ పోరాటం చేయడానికి అవసరమైన డబ్బు కూడా తమ దగ్గర లేదని వాపోతున్నాడు.
పిల్లల చదువుల కోసం ఉపయోగపడే స్కూలుకు తన భూమిని ఇవ్వడం తన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందని అపుడు అతను ఊహించలేదు. ప్రభుత్వం మొండి చేయి చూపించింది. తూతూ మంత్రంగా స్వీపర్ ఉద్యోగం ఇచ్చి సరిపెట్టుకుంది. అదీ అరకొర జీతంతో ఈ విషయాన్ని బీబీసీ రిపోర్టు చేసింది. ఆ గ్రామంలో పాఠశాల కోసం స్థలానికి వదులుకున్న వ్యక్తి మహమ్మద్ ఒక్కడేననీ పేర్కొంది. అతని కొడుకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ, జీతాలు పెంచుతామన్న హామీ సహా నష్టపరిహారం అందలేదని వెల్లడించింది.
ఇక్కడ ఇంకో విషాదం ఏమంటే మహమ్మద్ కొడుకు ముంతాజ్ అహ్మద్ కూడా అదే జీతంతో అదే స్వీపర్ ఉద్యోగంలో చేరాడు. ఎప్పటికైనా తమకు న్యాయం జరగకపోతుందా అనే ఆశతో. కానీ, రెండు మూడు నెలలుగా అతనికి ఆ జీతం కూడా ముట్టడం లేదు.