మూడు గంటల్లో విడాకులు, మళ్లీ పెళ్లి
రాంచీ: జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో రుబీనా పర్వీన్ అనే 18 ఏళ్ల యువతి బుధవారం నాడు తాను పెళ్లి చేసుకున్న భర్త ముంతాజ్ అన్సారీ అనే యువకుడికి మూడు గంటల్లో విడాకులిచ్చి అదే రోజు మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడు గంటల్లోనే మొదటి భర్తను వదిలేయడానికి కారణం కట్నం కింద మోటార్ సైకిల్‌ను డిమాండ్ చేయడమే.
పెళ్లి కట్నం కింద మోటార్ బైక్ మాట్లాడుకోనప్పటికీ పెళ్లయిన వెంటనే మొదటి భర్త ముంతాజ్ మోటార్ సైకిల్ కావాలంటూ అత్తింటి వారిని డిమాండ్ చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే పెళ్లి కూతరును ఇంటికి తీసుకెళ్లేలేదని మొండికేశారు. అదే గ్రామంలో ఓ మోస్తరు హోటల్‌ను నడుపుతున్న పెళ్లి కూతురు తండ్రి బషీర్ ఉద్దీన్ అన్సారీ ఆగమేఘాల మీద మార్కెట్‌కు వెళ్లి హీరో హోండా ఫ్యాషన్ బైక్‌ను కొనుగోలుచేసి అల్లుడి కోసం తెచ్చారు. ఆ బైక్ తనకొద్దని, అంతకంటే ఖరీదైన బైక్ కావాలని అల్లుడు మళ్లీ గొడవ చేశారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్దలు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు.
దీంతో తనకు ఈ భర్త వద్దని, ఇప్పుడే ఇంతగా వేధిస్తే మున్ముందు ఎంతగా వేధిస్తాడోనని పెళ్లి కూతురు రుబానా పర్వీన్ కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. దాంతో పెళ్లి తెగతెంపులు చేసుకొనేందుకు సిద్ధపడ్డ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ముస్లిం పెళ్లి పెద్ద ‘కాజా’కు కబురు పెట్టారు. పెళ్లి కొడుకు ముంతాజ్ మెడలో చెప్పుల దండ, కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అన్న బోర్డును తగిలింగి పెళ్లి పందిట్లో తిప్పి, గుండు గీయించి ఇంటికి పంపారు. పెళ్లి కొడుకును సమర్థించినందుకు అతని తమ్ముడికి కూడా సగం గుండు గీయించి పంపారు.
ఈలోగా కాజా వచ్చి రుబానా మొదటి పెళ్లిని రద్దు చేశారు. ఆమె తండ్రి బషీరుద్దీన్ అదే ఊరికి చెందిన మొహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి అదే పందిట్లో అదే రోజు రాత్రి తన కూతురికి రెండో పెళ్లి చేశారు. జరిగిన సంఘటనల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని, జీవితాంతం ఎదురయ్యే వేధింపుల నుంచి తన కూతురుని రక్షించుకున్నానన్న ఆనందం తనకుందని బషీరుద్దీన్ వ్యాఖ్యానించారు.