Munavar Salim
-
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
అంబర్‌పేట: కుటుంబ కలహాలతో తమ్ముడినే అన్న హత్య చేసిన ఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం ప్రకారం.. అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌కు చెందిన సర్దార్కు నలుగురు కుమారులు. వీరిలో మునావర్ (32) కొద్దికాలం క్రితం మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఆమె మునావర్‌ను విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇతను మానసికంగా కుంగిపోయాడు. కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదంటూ వారితో గొడవకు దిగేవాడు. అన్నదమ్ములు ఎంత సముదాయించినా వినిపించుకునేవాడు కాదు. మునావర్ కారణంగా ఆ కుటుంబంలో గొడవలు తరచూ జరిగేవి. సోమవారం రంజాన్ పండగను కుటుంబ సభ్యులు సంతోషంగా నిర్వహించుకున్నారు. మునావర్, ఆయన పెద్ద సోదరుడు షాహీద్ ఇంట్లో రాత్రి పొద్దుపోయే వరకు మద్యం తాగారు. అర్ధరాత్రి షాహీద్ మునావర్ కాళ్లు కట్టేసి మరో తాడుతో ఉరి బిగించేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న ఇతర కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు కారణమైన షాహీద్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
‘గూఢచర్యం’లో ఎంపీ వ్యక్తిగత సహాయకుడి అరెస్టు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి దేశ రక్షణ సమాచారాన్ని చేరవేస్తున్న కేసులో సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మునవర్ సలీమ్ వ్యక్తిగత సహాయకుడు(పీఏ) ఫర్హత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం సలీమ్ నివాసంలో ఫర్హత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఫర్హత్‌కు ఐఎస్ఐతో 18 ఏళ్లుగా సంబంధాలున్నాయని, సమాచారం అందజేసినందుకు అతనికి రూ.20 వేలు ఇచ్చేవారని పోలీసులు చెప్పారు. ఫర్హత్ పేరును ఈ కేసులో సూత్రధారి, పాక హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. వార్తా చానళ్లలో ప్రసారమైన వీడియో వాంగ్మూలంలో ఫర్హత్‌తో పాటు సహోద్యోగులైన సయ్యద్, ఖాదిమ్, షాహిద్, ఇక్బాల్ చీమా కూడా తనకు సహకరించినట్టు అక్తర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పూర్తిగా విచారించిన తరువాతే ఫర్హత్‌ను పీఏగా నియమించుకున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సలీమ్ వెల్లడించారు. గతంలో మరికొంత మంది ఎంపీల వద్ద కూడా అతడు పనిచేశాడన్నారు. విచారణకు అన్ని విధాలా తాను సహకరిస్తానన్నారు.