
మునావర్ (ఫైల్)
అంబర్‌పేట: కుటుంబ కలహాలతో తమ్ముడినే అన్న హత్య చేసిన ఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం ప్రకారం.. అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌కు చెందిన సర్దార్‌కు నలుగురు కుమారులు. వీరిలో మునావర్ (32) కొద్దికాలం క్రితం మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఆమె మునావర్‌ను విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇతను మానసికంగా కుంగిపోయాడు. కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదంటూ వారితో గొడవకు దిగేవాడు.
అన్నదమ్ములు ఎంత సముదాయించినా వినిపించుకునేవాడు కాదు. మునావర్ కారణంగా ఆ కుటుంబంలో గొడవలు తరచూ జరిగేవి. సోమవారం రంజాన్ పండగను కుటుంబ సభ్యులు సంతోషంగా నిర్వహించుకున్నారు. మునావర్, ఆయన పెద్ద సోదరుడు షాహీద్ ఇంట్లో రాత్రి పొద్దుపోయే వరకు మద్యం తాగారు. అర్ధరాత్రి షాహీద్ మునావర్ కాళ్లు కట్టేసి మరో తాడుతో ఉరి బిగించేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న ఇతర కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు కారణమైన షాహీద్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment