హెచ్ఎస్ఐఎల్ నుంచి...వాటర్ ప్యూరిఫయర్లు
♦ మూన్బో బ్రాండ్లో విడుదల
♦ 2018 నాటికి సొంత ప్లాంటు
♦ కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సానిటరీవేర్ రంగంలో ఉన్న హెచ్ఎస్ఐఎల్ తాజాగా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి ప్రవేశించింది. మూన్బో బ్రాండ్లో అయిదు వేరియంట్లను ఆవిష్కరించింది. ధరల శ్రేణి రూ.12,990-26,990 మధ్య ఉంది. అత్యాధునిక హెక్సాప్యూర్ టెక్నాలజీని వీటిలో వాడారు. దీంతో స్వచ్ఛమెన, భద్రమైన మంచినీరు అందుతుందని కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ ఈ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాకు తెలి పారు. అన్ని మోడళ్లకు డిజైన్ పేటెంట్లు దక్కించుకున్నట్టు చెప్పారు. నీటి శుద్ధి విధానానికి సైతం పేటెంటు రానుందన్నారు. కొద్ది రోజుల్లో యూవీ గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లను విడుదల చేస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధికి టర్నోవరులో 5-6 శాతం వెచ్చిస్తామని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
పట్టణాల్లోనే ప్యూరిఫయర్లు..
ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల వినియోగం నగరాలకే పరిమితమవుతోంది. దీనికి కారణం ఉత్పత్తులు ఖరీదుగా ఉండడమే. అందుబాటు ధరలో ఉన్న కారణంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లు తృతీయ శ్రేణి పట్టణాల దాకా విస్తరించాయి. మొత్తంగా దేశంలో ప్యూరిఫికేషన్ పరికరాల వినియోగం 2 శాతమేనని కంపెనీ వెల్లడించింది. రూ.15-20 వేల శ్రేణి వేగంగా విస్తరిస్తోంది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా 35 శాతముంది. రూ.10-15 వేల శ్రేణి 25 శాతం, రూ.20 వేలు ఆపైన 8 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 22-25 శాతం వృద్ధితో రూ.4,000 కోట్లుంది. ఇందులో 9 శాతం వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. పరిశ్రమలో పరిమాణం పరంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్ల వాటా 50 శాతం ఉంది. 10 ఏళ్లలో వ్యవస్థీకృత రంగ వాటా 20 నుంచి 55 శాతానికి ఎగసింది.
మూడేళ్లలో టాప్-3 స్థానం..
వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో మూడేళ్లలో 10 శాతం వాటాను మూన్బో లక్ష్యంగా చేసుకుంది. మూన్బో బ్రాండ్లో ఎయిర్ ప్యూరిఫయర్లను సైతం హెచ్ఎస్ఐఎల్ విక్రయిస్తోంది. హెచ్ఎస్ఐఎల్ ఇతర బ్రాండ్లలో వాటర్ హీటర్లు, గీజర్లు, కిచెన్ అప్లయెన్సెస్, ఎయిర్ కూలర్లను అమ్ముతోంది. అన్ని విభాగాల్లో వచ్చే మూడేళ్లలో టాప్-3 కంపెనీగా నిలవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు రాకేష్ వెల్లడించారు. థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో ఉత్పత్తులను తయరు చేయిస్తున్నట్టు చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్ల తయారీకి సొంత ప్లాంటు 2018 నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు.