రూపాయికే ముంద్రా ప్లాంట్ వాటా విక్రయం
ముంబై: తీవ్ర నష్టాల్లతో టాటా పవర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ముంద్రా ప్లాట్ విషయంలో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్‌లోని వాటా విక్రయం విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. 4 వేల మెగావాట్ల ముంద్రా యూపీఎంపీ (అల్టా మెగా పవర్ ప్రాజెక్టు)లో 51 శాతం ఈక్విటీ వాటాను కేవలం ఒక్క రూపాయికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటాను కొనుగోలు చేయాలని గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కు టాటా పవర్ అధికారులు లేఖ రాశారు. ఈ ప్రతిపాదన లేఖ కాపీలను విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, గుజరాత్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్‌కూడా అందించింది. ఈ లేఖలో రెండు ఆప్షన్స్ ను ప్రస్తావిస్తూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, లేకుంటే ఈక్విటీని కొనుగోలు చేసి ప్లాంటును నిర్వహించుకోవాలని కోరినట్టు సమాచారం.
ప్లాంటు నిర్వహణ పెనుభారం కావడంతో నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని, 49 శాతం వాటాదారుగా, ప్లాంటుకు అవసరమైన అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ లేఖలో టాటా పవర్ అధికారులు పేర్కొన్నారు. 2008లో వేసిన అంచనా వ్యయాల ప్రాతిపదికన ఇప్పుడు ప్లాంటును నడిపించడం ఎలా సాధ్యమని టాటా సన్స్ బోర్డు ప్రశ్నిస్తూ, ముంద్రా ప్లాంటు విస్తరణ పెట్టుబడులను అడ్డుకున్న వేళ, టాటా పవర్ ఈ లేఖను రాయడం గమనార్హం.
కాగా టాటా పవర్ ముంద్రా యుఎంపిపి ప్రాజెక్టు కోసం రూ.18,000 కోట్లు పెట్టుబడి పెట్టగా 2013-14లో ఈ ప్రాజెక్టుపై టాటా పవర్ రూ.1,500 కోట్ల నష్టాలు చవి చూసింది. ఈ ప్లాంటుకు మొత్తం సేకరించిన మొత్తం రు. 15000-16000 కోట్లు. ముంద్రా ప్లాంట్ బ్యాంకుల నుండి రూ .10,000 కోట్లు, టాటా గ్రూపు నుంచి 5000 కోట్ల రూపాయలను తీసుకుంది. మొత్తం రుణ 42,000-43,000 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఐదు రాష్ట్రాలతో (రాజస్థాన్, హర్యానా, పంజా, మధ్యప్రదేశ్, గుజరాత్) దీనికి అనుమతించాల్సి ఉంది.