కోరం లేక పోయె.. టీడీపీ పరువు పాయే
విజయనరం : రాష్ట్రంలో అధికారం వారిదే... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా ఉందంటారు.. అంతేందుకు మొత్తం 40 మంది సభ్యులున్న మున్సిపల్ పాలకవర్గంలో 32 మంది సభ్యులు అధికార పార్టీకి చెందిన వారే.... అయినా మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశ నిర్వహణకు అవసరమైన కోరం (మొత్తంలో కౌన్సిల్ సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు) లేకపోవడం గమనార్హం.
తన వ్యవహారశైలితో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన రూపొందించిన అజెండాలోని అంశాలను వ్యతిరేఖించిన సొంత పార్టీ కౌన్సిలర్లు సాధారణ సమావేశానికి హాజరుకాకుండా డుమ్మా కొట్టడంతో గట్టి ఝలక్ ఇచ్చినట్లైంది. చైర్మన్ తీరుతో మరో మారు సభ్యులు మధ్య విబేధాలు బహిర్గతకం కావడంతో టీడీపీ పరువు పోయింది. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పరిష్కారానికి కృషిచేయాల్సిన కౌన్సెలర్లు సమావేశానికి డుమ్మాకొట్టడంపై జనం మండిపడుతున్నారు.
అర్ధగంట సమయం నిరీక్షించినా 10 సభ్యులే హాజరు..
మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్టు చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కౌన్సిల్ సభ్యులతో పాటు అధికారులకు సమాచారం అందించారు. అజెండాలోని అంశాలను మూడు రోజుల ముందుగానే అందజేశారు. సమావేశం జరగాల్సిన నిర్ణీత సమయానికి సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే డుమ్మా కొట్టడంతో కంగుతిన్నారు.
మున్సిపల్ యాక్టు ప్రకారం 40 మంది సభ్యులున్న విజయనగరం మున్సిపాలిటీలో సభ నిర్వహణకు కోరంలో 14 మంది సభ్యులుండాలి. అయితే టీడీపీకి చెందిన 32 మంది కౌన్సిల్ సభ్యులు పాలకవర్గంలో ఉండగా... 10 మంది సభ్యులు మాత్రమే హాజరుకావడంతో సభ నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. దీంతో సభ్యుల కోసం సుమారు అర్ధగంట సమయం వేచి చూసిన అనంతరం 11 గంటల సమయంలో సభను మరో అర్ధగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చైర్మన్ వర్గీయులకు తప్పని తంటాలు..
సమావేశానికి అవసరమైన కోరం లేకపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైర్మన్ ప్రసాదుల ఎలాగైనా సభ నిర్వహించాలన్న ఆలోచనతో అప్పటికే సభకు హాజరైన తన వర్గీయులతో మిగిలిన సభ్యులను రప్పించేందుకు నానా తంటాలు పడ్డారు. ఫోన్లో సంప్రదింపులు చేస్తూ సమావేశానికి రావాలంటూ వర్తమానాలు పంపించారు.
చివరికి సమావేశ మందిరం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు కార్యాలయం పోర్టికో వద్ద కాపు కాసి వచ్చిన సభ్యులను సవినయంగా సమావేశ మందిరంలోకి తీసుకెళ్లడం విశేషం. ఈ సమయంలో 38వ వార్డు కౌన్సిలర్ గార.సత్యనారాయణ, 40వ వార్డు కౌన్సిలర్ ఆల్తిరాధ, 10వ వార్డు కౌన్సిలర్ ఉండ్రాళ్ల వెంకటలక్ష్మిలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న 8వ వార్డు కౌన్సిలర్ షేక్ షకిలా సభకు హాజరుకావటంతో చైర్మన్తో కలిపి కేవలం 15 మంది సభ్యులతో సభను ప్రారంభించాల్సి పరిస్థితి ఏర్పడింది.