బీఎంసీ, టీఎంసీల్లో విజయకేతనం
సాక్షి, ముంబై: ముంబై, ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన మేయర్ ఎన్నికలు మహాకూటమికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన శివసేన, బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వచ్చే నెలలో శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ఎన్నికలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ముంబై, ఠాణే జిల్లాల్లో 60 సెగ్మెంట్లున్నాయి. దీంతో మేయర్ ఎన్నికల ఫలితాల ప్రభావం తమకు లాభం చేకూరుస్తుందనే ధీమాతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. మరోవైపు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) మేయర్ పదవికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెన్నెస్‌కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు చేరడం శివసేనకు కలిసొచ్చే అవకాశముంది.
ఠాణే కొత్త మేయర్ సంజయ్ మోరే
ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)లో శివసేన మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మహాకూటమి తరఫున బరిలోకి దిగిన శివసేనకు చెందిన సంజయ్ మోరే ఠాణే విజయం సాధించారు. రెండున్నరేళ్ల క్రితం ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగ్గా, ఈసారి మాత్రం లాంఛనంగానే ముగిశాయి. ఊహించినవిధంగానే సంజయ్ మోరే మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా రాజేంద్ర సాప్తేలు విజయం సాధించారు.
ఈ పదవికోసం ప్రజాసామ్య కూటమి నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థిగా విక్రాంత్ చవాన్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మేఘనా హండోరేలు బరిలోకి దిగారు. సంజయ్ మోరేకి 66 ఓట్లు రాగా విక్రాంత్ చవాన్‌కు కేవలం 46 ఓట్లు దక్కాయి. 20 ఓట్ల తేడాతో మహాకూటమి అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్)కు చెందిన కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోగా, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.
దీంతో శివసేన అభ్యర్థులు అలవోకగా విజయం సాధించారు. రెండున్నరేళ్ల క్రితం బలాబలాలు సమానంగా ఉన్న కారణంగా ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ రవీంద్ర ఫాటక్తోపాటు ఆయన సతీమణి జయశ్రీ ఫాటక్ శివసేనలో చేరారు. శివసేన-బీజేపీల సంఖ్యాబలం (65) అలాగే ఉన్నప్పటికీ వీరి రాజీనామా కారణంగా కాంగ్రెస్-ఎన్సీపీల సంఖ్యాబలం 63కు తగ్గిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను కార్పొరేటర్లందరినీ ఎన్నికల సమయం వరకు అజ్ఞాతంలోనే ఉంచారు.