ప్రభుత్వం కోసం భవనాల పరిశీలన
- గుంటూరులో పురపాలక శాఖ కార్యాలయం ఏర్పాటు యోచన
- మిర్చి యార్డు, రైతు సంక్షేమ భవనం, ఎఫ్‌సీఐ గోడౌన్లు...పరిశీలన
అరండల్‌పేట (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ ప్రధాన కార్యాలయం గుంటూరులోని రైతుసంక్షేమ భవనంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని ప్రాంతమైన గుంటూరు-విజయవాడలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు శనివారం గుంటూరు నగరంలోనూ, పెదకాకాని ప్రాంతంలోనూ పర్యటించారు. ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ ప్రైవేటు భవనాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సభ్యులు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, పురపాలక శాఖ డెరైక్టర్ కన్నబాబులతోపాటు జిల్లా కలెక్టర్ కాంతి లాల్‌దండే తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ప్రధానంగా వివిధ శాఖల ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భవనాల విస్తీర్ణం సరిపోతుందా? లేదా? అని పరిశీలించారు. ముఖ్యంగా నగరంలోని చుట్టుగుంట సెంటరులోని రైతు సంక్షేమ భవనాన్ని పరిశీలించారు. ఇక్కడ పురపాలకశాఖ కార్యాలయం ఏర్పాటు చే సే విషయమై అధికారులు చర్చించారు. భవనంలోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం విస్తీర్ణం, రవాణా సౌకర్యం వంటివాటితోపాటు ఇతర అంశాలపై కూడా చర్చించారు. అనంతరం మిర్చియార్డులోని షెడ్లను పరిశీలించారు. అక్కడ ఏఏ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందో చర్చించారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఆ షెడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు.
అనంతరం నూతనంగా నిర్మించిన ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఇక్కడ ఇరిగేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తర్వాత గుంటూరుకు 7 కిలోమీటర్ల దూరంలోని పెదకాకానిలో ఉన్న ఎఫ్‌సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) గోడౌన్లను పరిశీలించారు. అక్కడ గౌడౌన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌సీఐ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ గోడౌన్లు ఏ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉంటాయన్న విషయమై ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎఫ్‌సీఐ మేనేజర్ సీహెచ్ వీరారెడ్డి మాట్లాడుతూ 36 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్స్ నిర్మించినట్లు తెలిపారు. మొత్తం 15 గోడౌన్లలో ప్రత్తి బేళ్ళు, బియ్యం బస్తాలు ఉన్నట్లు కమిటీ సభ్యులకు వివరించారు. తర్వాత కమిటీ సభ్యులు ఆచార్య నాగార్జున యూనివర్సీటీ ఎదురుగా, కంతేరు అడ్డరోడ్డు వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న గ్రీన్ పార్క్ ద్వారకా కృష్ణ అపార్ట్‌మెంట్స్‌ను పరిశీలించారు.
ఐజేఎం లింగమనేని టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన ఈ అపార్ట్మెంట్స్, విల్లాల ప్లాన్లను పరిశీలించారు. అక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్లు, విల్లాల లోపలి భాగాలను కూడా పరిశీలించారు. అక్కడ 300 ఫ్లాట్లు, 98 విల్లాలు ఐజేఎం ప్రతినిధులు అధికారులకు వివరించారు.