‘కట్టలు’ తెగుతున్నాయ్.. కోట్లు మారుతున్నాయ్
పాలకొల్లు/తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రచారం ముగిసిందో లేదో నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పాలకొల్లులో సుమారు రూ. 5 కోట్ల మేర పంపిణీ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా పెద్దమొత్తంలో డబ్బు పంపిణీ జరగడం విశేషం.
గతంలోజరిగిన ఎన్నికల్లో గృహోపకరణాలు, చీరలు వంటి బహుమతులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో అభ్యర్థులు నగదు పంపిణీపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. పాలకొల్లు పట్టణంలో టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం నుంచే నగదు పంపిణీని ప్రారంభించారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నగదు పంపిణీలో ముందున్నారు.
ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పట్టణంలోని ఒక వార్డులో ప్రముఖుడు పోటీ చేయడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. ఆయన ఒక్కో ఓటరుకు రూ. 3 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎన్నికల రోజు తెల్లవారుజామున మహిళలకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోనూ ఇదే పరిస్థితి.
పట్టణంలో ఓటర్లకు పంచేందుకు గోదాములలో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు పట్టు పంచెలు, పట్టు జాకెట్లు సిద్ధంగా ఉంచినట్టు సమాచారం. చీరలు, హాట్ ప్యాక్‌లు నజరానాలుగా ఇవ్వడానికి అభ్యర్థులు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ. 2 వేల వరకు పంపకాలు జరుగుతున్నాయి. ఓ పార్టీకి చెందిన నేత రెండు వార్డులలో నోట్లను ఓటు స్లిప్‌కు పిన్ చేసి మరీ పంచుతున్నట్టు ఓటర్లు చెబుతున్నారు.
పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో వైసీపీకి చెందిన అభ్యర్థులను టార్గెట్ చేసుకుని ఇబ్బందిపెడుతున్నట్టు ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు.