మహదేవమ్మకు మళ్లీ పీఠం దక్కేనా
చర్చనీయాంశంగా మారిన నగరసభ అధ్యక్ష ఎన్నికలు
రాయచూరు : రాయచూరు మున్సిపల్ చైర్మన్ పదవి మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఏడాది సెప్టెంబర్ 6న గద్దెనెక్కిన మహదేవమ్మను జూలై 14న అవిశ్వాస తీర్మానంతో గద్దె దిగారు. అప్పటి నుంచి ఇంచార్జి అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలైన పద్మశ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈమె ఈ పదవిలో కొనసాగడంపై మీమాంస నెలకొంది. ఎస్టీ మహిళకు కేటాయించిన ఆ పదవిలో ఇంచార్జి అధ్యక్షురాలిగా ఎన్నాళ్లు ఉండవచ్చనే అంశంపై చర్చ సాగుతుండగానే అధ్యపదవికి 6న ఎన్నికలు జరపాలని కూడా జిల్లాయంత్రాంగం తీర్మానించింది.
దీనిపై మహదేవమ్మకు వ్యతిరేకంగా నిలిచిన 33 కౌన్సిలర్లు కొంచం డోలాయమానంలో పడ్డారు. అసలు మద్దతులేకుండా మహదేవమ్మ మళ్లీ గద్దెనెక్కగలరా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఇంచార్జి అధ్యక్షురాలే ఉండాలన్న పట్టుదలతో కొందరు తాజా ఎన్నికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు వరకు పైరవీలు చేస్తున్నారని తెలిసింది. కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు విభేదాలకు మున్సిపల్ రాజకీయాలు పరాకాష్టనందుకున్నాయి.
వాస్తవంగా ఏ పార్టీకి చెందని మహదేవమ్మ అనివ్యార్యంగా అప్పట్లో గద్దెనెక్కారు. ఇందుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. అయితే ఆమె సీనియర్ల మాటపట్టించుకోదన్న అక్కసుతో గత జూలై 14న గద్దెదించారు. ప్రస్తుతం మరికొంత ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలఫలితంగా 33గురు కౌన్సిలర్లలో విభేధాలు తలెత్తాయని చెబుతున్నారు. మహదేవమ్మకు జైకొట్టేందుకు కొందరు సిద్ధపడ్డారని కూడా అంటున్నారు.
ఏదిఏమైనా మున్సిపాలీటిక్స్ రసకందాయంలో పడ్డాయి. 35 స్థానాలున్న ఈ మున్సిపాల్టీలో ఎవరికి తగిన మెజార్టీ రాలేదు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు వరుసగా ఎస్టీ మహిళ, జనరల్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సరిగ్గా ఏడాదైంది. మరో 18 నెలలపాటు ఎస్టీ మహిళ అధ్యక్ష పదవిలో కొనసాగాలన్నది రిజర్వేషన్ చెబుతున్న సత్యం. మరీ దీన్ని ఏకతాటిపై నిలిచి ఆమెను ఓడగొట్టిన కౌన్సిలర్లు ఏ మేరకు పాటిస్తారో వేచిచూడాల్సిందే.