ప్రచారం ఉధృతం
వైఎస్ఆర్సీపీ దెబ్బకు
టీడీపీ నేతల పరుగులు
సాక్షి, చిత్తూరు: మున్సిపోల్స్ ప్రచార పర్వం తారస్థారుుకి చేరుకుంది. నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రచారానికి దిగడంతో ఆయా పట్టణాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్ఆర్ సీపీ జోరుకు టీడీపీ నాయకులు కంగారుపడుతున్నారు. ప్రచారం ప్రారంభ మైనా చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ నాయకుల్లో గందరగోళం వీడలేదు.
చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏఎస్ మనోహర్ ఉదయం నాలుగు వార్డులు, సాయంత్రం నాలుగు వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులు గ్రూప్ తగాదాలను సర్దుబాటు చేసుకోవడంలోనే మునిగిపోయారు. ప్రధానమైన కఠారి మోహన్, జంగాలపల్లి గ్రూప్‌లు ఎవరి మద్దతుదారులను వారు గెలిపించుకునేందుకు పరిమితమయ్యాయి.
పుంగనూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం చేసుకుంది. చాలా వార్డుల్లో ఏకపక్షంగా ముందు కు దూసుకెళ్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మైనారిటీల మద్దతుతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుంది. ఇద్దరు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్న టీడీపీ ఇంత వరకు ఇక్కడ ప్రచారం లో వెనుకే ఉంది.
దీంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటున్న అనిషారెడ్డి భర్త శ్రీనాథరెడ్డి రెండు రోజులుగా రంగంలోకి దిగారు. పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో వెఎస్ఆర్ సీపీ నాయకురాలు ఆర్కే రోజా ఆధ్వర్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి పోటీ ఇచ్చేందుకు, ప్రచారం ఉధృతం చేసేందుకు ఎమ్మెల్యే గాలి ముద్దుక్రిష్ణమనాయుడు తంటాలు పడుతున్నారు. వార్డు వార్డుకు వెళ్లేందుకు తన కుమారులను ప్రచారంలోకి దించారు.
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఎమ్మేల్యే బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి వైఎస్ఆర్ సీపీ హవాను అధిగమించేందుకు ఏం చేయాలా? అని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డుల్లో ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారానికి ప్రజల్లో స్పందన లేదు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఇల్లిల్లు తిరుగుతున్నారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న సుభాష్ చంద్రబోష్, ఆయన తమ్ముడు బాలాజీ ప్రచారం కోసం పరుగులు పెడుతున్నారు. మదనపల్లె మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీం అస్లాం వార్డుల్లో తిరుగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న గంగారపు రాందాస్‌చౌదరి సన్నిహితులతో కలిసి దేశం అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లోకి వెళ్తున్నారు.