ముప్పాళ్ల ఘటనపై వైఎస్ఆర్సీపీ నిరసన
ముప్పాళ్ల దాడి ఘటన పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌కు పార్టీ నేతలు ఉమ్మారెడ్డి, జ్యోతుల నెహ్రూ, అంబటి, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందించారు. శాసనసభను పరిరక్షించాల్సిన స్పీకర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ప్రజాస్వామ్యం మీద స్పీకర్‌కు విలువలుంటే జరిగిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
మైనార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై దాడి జరిగినా స్పీకర్ కనీసం స్పందించడం లేదని, ఈ దాడి సంఘటనపై వచ్చే శాసనసభ సమావేశాల్లో తాము నిలదీస్తామని తెలిపారు. ఎన్ని సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అధికార దాహం తీరటం లేదని, ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. ప్రజలు ఇవ్వని అధికారాన్ని లాక్కోవాలనే తపన చంద్రబాబుదని, ఇంత దారుణం జరిగినా ఆయన స్పందించకపోవటానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయకుండా అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని, టీడీపీ నేతలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నా పోలీసులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 మంది కార్యకర్తలను హతమార్చారని జ్యోతుల నెహ్రూ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు.