కాలిఫోర్నియా వర్సిటీ సీఐవోగా భారతీయ మహిళ
వాషింగ్టన్: అమెరికాలోని ప్రఖ్యాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(డేవిస్) ప్రధాన సమాచార అధికారిణి(సీఐవో)గా భారతీయ-అమెరికన్ మహిళ నియమితులయ్యారు. హైదరాబాద్లోని మహిళా కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వీజీ మురళికి ఈ ఘనత దక్కింది. ఉన్నత విద్యారంగంలో నిపుణురాలైన ఆమె కాలిఫోర్నియా వర్సిటీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆమె ద్వితీయ స్థానంలో ఉంటారు.
వీజీ అనుభవం, నైపుణ్యం తమ వర్సిటీ పేరు ప్రతిష్టలు పెంచేందుకు దోహదపడుతుందని నియామక ఉత్తర్వుల్లో చాన్స్లర్ లిండా పి.బి. కేథీ పేర్కొన్నారు. వీజీ మురళి 2007 నుంచి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సమాచార ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. ఆమె 1977లో ఓయూ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. 1981 వరకు ఓయూకు అనుబంధంగా ఉన్న రీజినల్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేశారు. ఆగస్టు 18వ తేదీన కాలిఫోర్నియా వర్సిటీలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు.