బ్రెయిన్ డెడ్ అమ్మ.. కవలలకు జన్మ..
ఎన్ని విధాలుగా వర్ణించిన ఇంకా వర్ణించడానికి మిగిలిపోయే ఆనందం పేరు అమ్మ. అమ్మ గొప్పతనం మరోమారు చాటిచెప్పే సంఘటన బ్రెజిల్లో వెలుగు చూసింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ దాదాపు 123 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కవలలకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మ్యూరియల్ పదిల్హ(24), ఫ్రాంక్లిన్ డిసిల్వా జాంపోలి పదిల్హ(21)లు భార్యభర్తలు.
మ్యూరియల్ వృత్తిరీత్యా రైతు. వివాహం జరిగిన కొన్నాళ్లకే భార్య గర్భం దాల్చడంతో అందరిలానే సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు. ఓ రోజు మ్యూరియల్ పొలానికి వెళ్లిన సమయంలో తన తల తీవ్రంగా నొప్పిపెడుతుందంటూ ఫ్రాంక్లిన్ ఫోన్ చేసింది. సాధారణ నొప్పేమోనని భావించిన మ్యూరియల్ ట్లాబ్లెట్ వేసుకోవాలని సూచించాడు.
ట్యాబ్లెట్‌కు తగ్గేలా లేదని.. తన తలతో పాటు మెడ నరం నుంచి కూడా విపరీతంగా నొప్పి వస్తుందని ఫ్రాంక్లిన్ చెప్పడంతో హుటాహుటిన ఇంటికి చేరుకుని భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను వెంటనే గుర్తించిన డాక్టర్లు ఫ్రాంక్లిన్‌ను ఐసీయూకి తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తలలో ఒక నరం చిట్లి రక్తస్రావం ప్రారంభమైనట్లు డాక్టర్లు గుర్తించారు. అంతలోనే ఫ్రాంక్లిన్ కోమాలోకి వెళ్లిపోయింది.
అమ్మ కోమాలో ఉన్నా..
లిన్ గర్భంలో కవలలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమె కోమాలోకి వెళ్లినా చిన్ని గుండెలు మాత్రం కొట్టుకుంటున్నాయని(అప్పటికి లిన్‌కు ఏడు నెలలు) మానవ ప్రయత్నంతో వారిని రక్షించాలని భావించారు. అనుకున్నదే తడవుగా అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. 123రోజుల పాటు బిడ్డలను తల్లిగర్భంలో సేఫ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నెలలు నిండిన తర్వాత లిన్‌కు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు కవలలు(బాబు,పాప)ను బయటకు తీశారు. అయితే, ఆపరేషన్ పూర్తైన వెంటనే లిన్ మరణించింది.
గర్భంలో ఉన్న బిడ్డలను లాలించా..
కదలిక లేని తల్లి శరీరంలో ఉన్న బిడ్డలకు అన్నీ తానై లాలించానని వారి తండ్రి మ్యూరియల్ చెప్పారు. లిన్ గర్భంపై తల ఆన్చి పిల్లలతో కబుర్లు చెప్పానని, కానీ ఇప్పుడు ఆమె తనతో లేకుండాపోయిందని కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం బిడ్డలే లోకంగా బతుకుతున్నానని చెప్పారు. చూడ ముచ్చటగా ఉన్న బిడ్డల ఫోటోను మీడియాతో పంచుకున్నారు. బిడ్డలు జన్మించిన సమయంలో డాక్టర్లతో పాటు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారని వెల్లడించారు.
ఆసుపత్రిలోని తమ దీనగాథ విన్న వందలాది మంది బ్రెజిలియన్లు వేల కొద్దీ పౌండ్లను వైద్యం కోసం సాయం చేశారని చెప్పారు. కొందరు పిల్లలకు దుస్తులు తదితర వస్తువులు ఇచ్చారని తెలిపారు. తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను మూడు నెలల పాటు ఇంక్యూబేటర్లో ఉంచామని చెప్పారు. ఆ తర్వాత వారు సాధారణ స్ధితికి చేరుకున్నట్లు వెల్లడించారు.