రూ.39 వేలు పలికిన నిమ్మకాయ
టీనగర్: తిరువెన్నైనల్లూరు సమీపంలోగల ఒట్టనందల్ బాల దండాయుధపాణి ఆలయంలో నిమ్మకాయలను భక్తులు పోటాపోటీగా వేలంలో తీసుకున్నారు. ఒక నిమ్మకాయ రూ.39 వేలకు వేలం వేశారు. విల్లుపురం జిల్లా, తిరువెన్నైనల్లూరు సమీపంలో ఒట్టనందల్ గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయం వుంది. ఇక్కడ పంగుణి ఉత్తర ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు సుబ్రహ్మణ్యస్వామి సమీపంలో ఏర్పాటైన శూలంపై ప్రతిరోజూ ఒకటి చొప్పున తొమ్మిది నిమ్మకాయలను గుచ్చి ఉంచుతారు. తర్వాత వీటిని బహిరంగంగా తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నిమ్మరసాన్ని సంతానం లేని దంపతులు సేవించినట్లయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. ఈ ఉత్సవాలలో 11వ రోజైన గురువారం రాత్రి 11 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగిన ఇడుంబన్ పూజలో ఇడుంబన్ స్వామికి కరువాడు భోజనం నైవేథ్యంగా సమర్పించారు.
ఆ తర్వాత గ్రామ ప్రజల సమక్షంలో తొమ్మిది నిమ్మకాయలను వేలం వేసే కార్యక్రమం జరిగింది. గ్రామ అధ్యక్షుడు బాలకృష్ణన్, షణ్ముగం ఆచారి సమక్షంలో ఈ వేలం పాట సాగింది. వేలం ప్రారంభం కాగానే సుబ్రహ్మణ్యస్వామి శూలంలో ఉత్సవాల మొదటి రోజున గుచ్చివుంచిన నిమ్మకాయను వేలం వేశారు. దీనికోసం అనేక మంది దంపతులు పోటాపోటీగా వేలం పాడారు. చివరిగా ఈ నిమ్మకాయను ఒట్టనందల్ గ్రామానికి చెందిన జయరామన్, అమరావతి దంపతులు గరిష్టంగా రూ.39 వేలకు పాడారు. మూడో రోజు నిమ్మకాయను మండగమేడు గ్రామానికి చెందిన పన్నీర్ వసంత దంపతులు రూ.7,711కు వేలం పాడారు.