చోరీలకు పాల్పడే ఘరానా దొంగ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఘరానా దొంగని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో 14కుపైగా కేసుల్లో ఇప్పటికే అరెస్టు అయి బయట తిరుగుతున్న వట్టపల్లి గుంతల షా దర్గా వాసి హబీబ్ ముసఫా ఖాన్ (అలియాస్ అఫ్జల్ ఖాన్, దిలవర్ ఖాన్)పై చాంద్రాయణ గుట్ట పోలీసు స్టేషన్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదుమేరకు కేసులు నమోదుచేశారు. ఈ మేరకు చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద వృత్తిరీత్యా బైక్ మెకానిక్ అయిన హబీబ్‌ను పట్టుకున్నారు.
సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్ రావు కథనం ప్రకారం... గతేడాది డిసెంబర్ 14న చాంద్రాయణ గుట్టలోని సోనీ షాప్‌లో యజమాని మహ్మద్ సైఫుద్దీన్, అతని కుటుంబసభ్యులు లేకపోవడంతో హబీబ్...సహచరుడు గఫ్ఫర్ సహకారంతో మెయిన్ డోర్‌లాక్‌ను ధ్వంసం చేసి పది తులాల బంగారు ఆభరణాలు, ఎల్సీడీ టీవీ, రెండు మొబైల్‌లు, రూ.50వేల నగదు అపహరించుకపోయాడు.
2013 నవంబర్‌లో చాంద్రాయణగుట్టలోని మిలాత్నగర్లో అఫ్జల్ఖాన్ కుటుంబసభ్యులు ఇంట్లో లేనిది గమనించి హబీబ్, అతని సోదరుడు సల్మాన్‌ఖాన్, గఫ్పర్లు కలిసి ఇంటి తాళాన్ని పగులగొట్టి 25 తులాల బంగారు ఆభరణాలు, రెండు వీడియో, డిజిటల్ కెమెరాలు, రెండు ఐప్యాడ్ ఫోన్లు, ఎనిమది గడియారాలు, రూ.60వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన సీసీఎస్ స్పెషల్ టీమ్టూ పోలీసు ఇన్స్పెక్టర్ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద హబీబ్‌ను వలపన్ని పట్టుకున్నారు. సుమారు ఐదు లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఎల్సీడీ టీవీ, రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గఫ్పర్ పరారీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటుపడిన హబీబ్ ఉదయమంతా బైక్ మెకానిక్ పనిచేస్తూ...రాత్రివేళలో ఇళ్లకు కన్నాలు వేసేవాడని పోలీసులు చెబుతున్నారు.