సెప్టెంబర్ 11 స్మారక మ్యూజియం ఏర్పాటు
సందర్భం డబ్ల్యూటీసీపై దాడికి 13 సంవత్సరాలు
సాధారణంగా చరిత్రలో అనేక సంఘటనలు జరుగుతాయి. అవి కొంతకాలం గడిచాక కాలగర్భంలో కలసి పోతాయి. కానీ సెప్టెంబర్ 11 సంఘటనను అమెరికా పాలకులు మరచిపోలేదు. డబ్ల్యూటీసీని ఉగ్రవాదులు కూల్చి వేసిన ప్రాంతంలోనే 1,10,000 అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్థుల భవనంగా స్మారక మ్యూజియమ్ను నిర్మించారు. ఇలాంటి మ్యూజియం నిర్మించడం ప్రపంచంలోనే ప్రథమం.
మ్యూజియం ఏర్పాటుకు నిపుణుల సలహాలు....
మ్యూజియం ఏర్పాటుకు అమెరికా ప్రభుత్వం పెద్ద కసరత్తునే నిర్వహించింది. మ్యూజియంను ఎలా నిర్మించాలనే విషయంలో సామాజిక శాస్త్ర వేత్తలు, జర్నలిస్టులు, పత్రికా సంపాదకులు, వాణిజ్య వేత్తలు ఇతర నిపుణుల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించారు. అమెరికాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వేలాది సూచనలు వచ్చాయి. వాటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకున్నారు. చివరకు అన్ని హంగులతో మ్యూజియంను నిర్మించారు.
ప్రపంచ ఉగ్రవాదం గురించి అధ్యయనం చేసేందుకు ఇదొక పరిశోధన కేంద్రంగా ఉపయోగపడే విధంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ ఘోర సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన వేయి మంది బాధితులు అనుభవించిన బాధను, ఆక్రోశాన్ని రికార్డు చేశారు. సందర్శకులు తమ అభిప్రాయాన్ని రికార్డు చేసేందుకు మ్యూజియంలో ప్రత్యేకంగా స్టూడియోను ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపేసిన సెప్టెంబర్ 11 సంఘటన తాలూకు అనుభవాలను, శిథిలాలను, మృతుల చిత్రాలతో కూడిన చేదు జ్ఞాపకాలను ఇక్కడ పదిలం చేశారు.
ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నారు. మరణించిన వారి పేర్లను గ్రౌండ్ జీరో వద్ద నిర్మించిన రెండు స్మారక చిహ్నాలపై రాశారు. సెప్టెంబర్ 11న అమెరికా ప్రభుత్వం సేవా దినంగా ప్రకటించింది. ఈ రోజున మ్యూజియంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదంపై నిరంతర యుద్ధం చేస్తామని, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమని తాము దృఢంగా నమ్ముతున్నామని మ్యూజియం డెరైక్టర్ అలైస్ ఎం గ్రీన్వాల్డ్ తమ సందేశంలో పేర్కొన్నారు.
- న్యూయార్క్ నుంచి జి. గంగాధర్ (సిర్ప)