పోతన పేరిట జాతీయ అవార్డు
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : పోతన రచనలపై విసృ్తతంగా పరిశోధనలు చేసిన రచయితలకు జాతీయ స్థాయి అవార్డు అందజేయాలి.. ఇందుకోసం ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపుతాం.. మహాభాగవత రచన చేసి దేశ సమైక్యతకు దారి చూపిన పోతన రచనలు ప్రపంచానికి తెలియజేసే విధంగా వెబ్సైట్ ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ ప్రకటించారు. శనివారం సాయంత్రం పోతన విజ్ఞానపీఠం 15వ సర్వసభ్య సమావేశాన్ని ఆడిటోరియంలో నిర్వహించారు. పీఠం చైర్మన్ జిల్లా కలెక్టర్ కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడిటోరియం, గ్రంథాలయం, సంగీత కళాశాల భవనం, ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు రూపొందించిన పొతన చిత్రపటాలను పరిశీ లించారు.
అనంతరం 2013 వరకు జరిగిన ఆడిట్ అకౌంట్స్ అమోదం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతన విజ్ఞాన పీఠానికి పూర్వవైభవం తేవడానికి కార్యవర్గ సభ్యులు జిల్లాలోని పెద్దలతో సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. విజ్ఞాన పీఠం ద్వారా నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలపై వార్షిక ప్రణాళికను ముంగానే తయారుచేసి దాని ప్రకారం నిర్వహించాలని చెప్పారు. నేటి తరం యువతీ యువకులలో పోతన సాహిత్యంపై అవగాహన కల్గించడానికి పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలన్నారు. విజ్ఞాన పీఠం ఆడిటోరియం ను ఆధునికరించే విషయం పరిశీలిస్తానని తెలిపారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండా ప్రకాశ్ మాట్లాడుతూ తమ అల్లూరి మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులచే వెబ్సైట్ రూపొందించడంలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ బమ్మెర పోతన రాసిన మహాభాగవత రచన తరువాతే మనదేశంలో భక్తి సంప్రదాయం వచ్చిందని, దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచిందని అన్నారు. జిల్లా పద్యనాటక పరిషత్ ప్రధాన కార్యదర్శి మారెడోజు సదానందచారి మాట్లాడుతూ తాము ఏదేళ్లుగా పద్యనాటిక ఏకాంకిక పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జిల్లా యంత్రాంగ ఆర్థికంగా సహకరించాలని, ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదని చెప్పారు.
ప్రసారిక సంపాదకులు, న్యాయవాది నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ పీఠంలో ప్రతి సంవత్సరం శాశ్వత కార్యక్రమాల క్యాలెండర్ ఏర్పాటు చేసి, ఇందుకు శాశ్వత నిధిని సమకూర్చాలని కోరారు. వల్సపైడి మాట్లాడుతూ జిల్లా యంత్రాగం నిర్వహించే సాంసృ్కతిక కార్యక్రమాలను పోతన విజ్ఞాన పీఠం వేదికపై నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో కె.వెంకటరమణ, పోతన విజ్ఞాన పీఠం మేనేజర్ జమ్మలమడక నాగమణీంద్ర శర్మ, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య పాండురంగారావు, కుందావర్జుల కృష్ణమూర్తి, వ్యాకరణం నాగేశ్వరరావు, అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయినీ విద్మహే, ఆకారపు రాజాచెన్నవిశ్వేశ్వరరావు, డాక్టర్ విశ్వనాథ్‌రావు, వీఆర్ విద్యార్థి, వర్జుల రంగాచార్య, జి.పద్మజ, పొట్లపల్లి శ్రీనివాసారావు, జీవీ బాబు, పుల్లయ్య, కేవీఎన్.చారి, సురేష్ పాల్గొన్నారు.