Music company
-
సారేగామా లాభాల గానా
న్యూఢిల్లీ: మ్యూజిక్ లేబుల్ దిగ్గజం సారేగామా ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 17 శాతం ఎగసి దాదాపు రూ. 34 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 29 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 34 శాతంపైగా జంప్‌చేసి రూ. 145 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో కేవలం రూ. 108 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ వ్యయాలు సైతం క్యూ2లో 43 శాతం పెరిగి 105 కోట్లయ్యాయి. దేశీయంగా ఊపందుకున్న డిజిటైజేషన్, లాక్డౌన్ తదితర అంశాలు కంటెంట్ భారీ వినియోగానికి కారణమైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఫలితాల విడుదల నేపథ్యంలో సారేగామా ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 4,216 వద్ద ముగిసింది. -
టిక్‌టాక్‌కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!
వాషింగ్టన్: చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు వరుసగా షాకులు తగులుతున్నాయి. 2019 ఫిబ్రవరిలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్ డిక్రీ) ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఎఫ్‌టీసీ ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్ డాలర్ల మేరు జరిమానా విధించింది. ఇక ప్రస్తుత ఫిర్యాదుతో మరోసారి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్ అమెరికన్ మ్యూజిక్ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. (అప్పట్లో భారీ జరిమానా.. టిక్‌టాక్‌కు మరోదెబ్బ!) పాటలకు పెదవి కలుపుతూ, నర్తిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న టిక్‌టాక్ పట్ల ఆకర్షితులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటలు, భావోద్వేగాలు, డైలాగులకు అనుగుణంగా అభినయిస్తూ వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించిన ఈ యాప్ వల్ల ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది టిక్‌టాక్‌లో అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని తమ టాలెంట్ బయటపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమకిష్టమైన పాటలకు పెదవి కలుపుతూ.. నర్తిస్తూ ఫ్యాన్స్‌ను సంపాదించుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుని టిక్‌టాక్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సల్ సహా పలు కంపెనీలు అనుమతి లేకుండా తమ పాటలను వినియోగించుకుంటున్నందుకు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌పై భవిష్యతులో దావా వేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో అందుబాటులో ఉన్న 50 శాతం మ్యూజిక్ లైసెన్స్ లేకుండానే పబ్లిష్ చేసిందన్నారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆడియో సంస్థగా పేరొందిన యూనివర్సల్ మ్యూజిక్.. లైసెన్స్ విషయంలో టిక్‌టాక్‌తో ఒప్పందం కుదర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది. రాయల్టీలు చెల్లించడం లేదు కాగా యూనివర్సల్ సాంగ్రైటర్స్ బిల్లీ ఎలిష్, లేడీ గాగా, ఎల్టన్ జాన్, టేలర్ స్విప్ట్ వంటి ప్రఖ్యాత పాప్ సింగర్ల పాటలు వాడుకుంటున్న టిక్‌టాక్ వారికి రాయల్టీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలో వారి క్రేజ్‌తో యూజర్లను ఆకట్టుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న టిక్‌టాక్‌లో మ్యూజిక్ ఒక ప్రధాన అవసరంగా మారిన నేపథ్యంలో పాటల కంపెనీలు ఈ మేరకు సంస్థ నుంచి తమకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాగా 75 బిలియన్ డాలర్ల విలువ కలిగిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ పబ్లిక్ ఆఫర్‌కు వెళ్లే యోచనలో ఉంది. (సాఫ్ట్‌బ్యాంకు బోర్డు సభ్యత్వానికి జాక్ మా రాజీనామా!) జపాన్ దిగ్గజం సాప్ట్‌బ్యాంక్, సికోఇయా క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లను కలిగి ఉన్న ఈ సంస్థ పబ్లిక ఆఫర్ ప్రకటించనుందన్న వార్తల నేపథ్యంలో.. యూనివర్సల్ మ్యూజిక్ వారం రోజుల్లోగా తమ ప్రతిపాదనకు స్పందించి... లైసెన్సింగ్ డీల్‌పై అభిప్రాయం చెప్పాలని టిక్‌టాక్‌కు డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవనున్నట్లు హెచ్చరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ విషయం గురించి టిక్‌టాక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ మ్యూజిక్ ఇండస్ట్రీతో వేల కొద్ది లైసెన్స్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మేం గర్వపడుతున్నాం. అయితే వీటి గురించి మేం వివరాలు వెల్లడించలేం’’అని స్పష్టం చేశారు. -
మన సంగీత మార్కెట్లోకి మరో దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు సంగీతాన్ని ఆస్వాదించే సంస్కృతి అద్భుతంగా ఉండడంతో భారతీయ పాటల ప్రపంచంలోకి మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘స్పాటిఫై’ అడుగు పెట్టింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ భారత పాటల మార్కెట్లోకి ప్రవేశించాలనే సంకల్పంతో సరిగ్గా 11 నెలల క్రితం ముంబైలో తన భారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయంలో మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇంతకుముందు ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ‘ఓఎల్ఎక్స్’కు సీఈవోగా పనిచేసిన అమర్‌సింగ్ బాత్రాను తీసుకున్నారు. భారతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తిని లాంఛనంగా ప్రవేశపెడుతున్నట్లు స్పాటిఫై వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో డేనియల్ ఎక్ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ భాషల్లో నాలుగు కోట్లకుపైగా భారతీయ పాటలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఏకంగా ‘త్రీ బిలియన్ ప్లే లిస్ట్స్’తో విడుదల చేస్తున్నామని చెప్పారు. భారతీయ వినియోగదారుడి నుంచి నెలకు 119 రూపాయల చందాకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తమ పాటలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదే అమెరికా వినియోగదారుడి దగ్గరి నుంచి నెలకు 9.99 డాలర్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి జనవరి చివరలోనే ‘స్పాటిఫై’ భారతీయ మార్కెట్లోకి రావల్సి ఉండింది. అమెరికాలోని ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’కు చెందిన వార్నర్–ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ, స్పాటిఫై లెసెన్స్ ఒప్పందంపై ముంబై హైకోర్టుకు వెళ్లడంతో మార్కెట్లోకి రావడానికి ఆలస్యమైంది. హాలివుడ్ సింగర్స్ కేటి పెర్రీ, బెయాన్స్, కెండ్రిక్ లామర్, లెడ్ జెప్పెలిన్ కేటలాగ్‌ల విషయంలో రెండు కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయమై ఓ పక్క న్యాయ పోరాటం కొనసాగుతుండగానే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 20 కోట్ల మంది వినియోగదారులకు ‘స్పాటిఫై’ తన పాటల సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లోని అతిపెద్ద సంగీత బ్రాండ్ లేబుల్ కలిగిన టీ సీరీస్‌తో ఒప్పందం కుదుర్చుకొని 1,60,000 పాటల లైబ్రరీని సమకూర్చుకుంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 2017 లెక్కల ప్రకారం మొత్తం ఆసియాలో సంగీత మార్కెట్ రెవెన్యూ 38.2 శాతానికి విస్తరించగా ఒక్క భారత్‌లోనే 60.8 శాతానికి విస్తరించింది. భారత్‌లో ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు బాగా తగ్గడం కూడా సంగీత మార్కెట్ విస్తరించడానికి దోహదపడ్డాయి. 2020 నాటికి భారత సంగీత ప్రపంచంలో రెవెన్యూ 27.30 కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే అమెజాన్ కంపెనీ భారత సంగీత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఏడాది సబ్స్క్రిప్షన్ కింద కేవలం 999 రూపాయలనే వసూలు చేస్తోంది. ఇంగ్లీషు, హిందీతోపాటు పలు భారత ప్రాంతీయ భషల్లో కొన్ని కోట్ల కాటలాగ్లను ‘అమెజాన్ మ్యూజిక్’ అందిస్తోంది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘టెన్సెంట్’ భారతీయ సంగీత మార్కెట్లోకి ‘గానా’ పేరుతో ప్రవేశించింది. ఏకంగా 7.50 కోట్ల మంది నెల ఛందాదారులతో మార్కెట్లో నెంబర్ వన్‌గా చెలామణి అవుతోంది. రిలయెన్స్, ఏర్టెల్, వొడావోన్ కంపెనీలు భారతీయ సంగీత మార్కెట్లోకి ఎప్పుడో అడుగుపెట్టాయి. రిలయెన్స్ కంపెనీకి చెందిన ‘జియో మ్యూజిక్’ను గతేడాది మార్చి నెలలో అంతర్జాతీయ కంపెనీ ‘సావ్న్’లో వంద కోట్ల డాలర్లకు విలీనం చేసింది. -
ప్రధాని పేరుతో మ్యూజిక్ కంపెనీకి బెదిరింపు కాల్స్
న్యూఢిల్లీ: ప్రధాని పేరుతో ఒక మ్యూజిక్ కంపెనీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్-2 ప్రాంతానికి చెందిన సూపర్ కేసెట్స్ ఇండస్ట్రీస్ యజమాని వేదప్రకాశ్ చనానా ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచి పోలీసులు బుధవారం చెప్పారు. ప్రధాని మన్మోహన్‌తో పాటు బీజేపీ నేత శతృఘ్న సిన్హా, ఆర్జేడీ అధినేత లాలూ తదితరుల పేరుతో కూడా తమ సిబ్బందికి కాల్స్ వచ్చాయని వేదప్రకాశ్ తన ఫిర్యాదులో తెలిపారు. సూపర్ కేసెట్స్ కంపెనీకి లయాజన్ కన్సల్టంట్గా పనిచేస్తున్న కిషన్ కుమార్ అనే వ్యక్తికి చెందిన బిల్లులను క్లియర్ చేయకుంటే కంపెనీని మూయించేయడంతోపాటు, కంపెనీ సిబ్బందిని హతమారుస్తామని బెదిరించినట్లు వేదప్రకాశ్ ఆరోపించారు.