దృశ్యకావ్యం కోసం రోజుకు 18 గంటలు పనిచేశా!
- సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్
సంగీత దర్శకుడు కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం..’ పాట టకీమని గుర్తొస్తుంది. ఆ చిత్రంలోని ఆయన సంగీతానికి ఎంత గుర్తింపు వచ్చిందంటే, ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరు అయిపోయింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తీసిన ‘వాన’ కూడా కమలాకర్ కెరీర్లో మరపురాని మలుపు. తాజాగా ఆయన స్వరాలందించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. పుష్యమి మూవీ మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ప్రాణం’ కమలాకర్ తన కెరీర్ గురించి, ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు.....
మీ పాటలు విని చాలా కాలమైపోయింది. ఇంతకాలం ఎక్కడున్నారు?
నేనెప్పుడూ సంగీత ప్రపంచానికి దూరం కాలేదు. నాకు సంగీతమంటే ప్రాణం. సంగీత దర్శకునిగా కాకుండా మ్యుజీషియన్‌గా ఇప్పుడు బిజీ అయిపోయా. ఏ.ఆర్ రహ్మాన్, బాలీవుడ్ గాయకుడు ఆర్జిత్సింగ్ల దగ్గర పని చేస్తూ బిజీగా ఉన్నా. రహ్మాన్ స్వరసార థ్యంలోనే ‘ఐ’, ‘లింగ’ చిత్రాలకు పని చేశా. ఇప్పుడు ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రోబో-2’ చిత్రాలకు పనిచేస్తున్నా ‘త్రాహిమామ్’, ‘భావయామి’ అనే ప్రైవేట్ ఆల్బమ్స్‌కు స్వరాలు అందించాను. ‘నాకో ఛాన్స్ ఇవ్వండి’ అంటూ ఎవరినీ అడగాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకు ముందు కూడా కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి. కానీ కథ సెట్ కాక వాటిని ఒప్పుకోలేదు. నాకు నచ్చి, సంగీతం అందించిన చిత్రమే ‘దృశ్యకావ్యం’.
దర్శకునిగా రామకృష్ణారెడ్డికిది మొదటి సినిమా. ఏయే అంశాలు నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారు?
దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నా దగ్గర కథ చెప్పడానికి వచ్చినప్పుడు మామూలు కమర్షియల్ సినిమా అయినా చేద్దామనుకున్నా. కానీ, ఆయన ఓ క్లీన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పాను. ముందు కథ కన్నా ఆయన టాలెంట్, కమిట్మెంట్, కథ మీద ఆయనకున్న క్లారిటీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను.
ఈ సినిమా మ్యూజిక్ గురించి..!
ఇందులో మొత్తం ఆరు పాటలు. ఆస్కార్ నామినీ బాంబే జయశ్రీ ఇందులో ఓ పాట పాడారు. సునీత, హేమచంద్ర, ప్రణవి, హైమత్ మిగతా పాటలు పాడారు.
ఇది మీ కెరీర్లో మొదటి హారర్ మూవీ. మరి... ఈ సినిమా రీ-రికార్డింగ్ గురించి ఏం చెబుతారు?
అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా టోటల్‌గా హారర్ మూవీ కాదు. హారర్ అనేది ఓ పార్ట్ మాత్రమే. ఈ చిత్రానికి రోజుకు 18 గంటలు వర్క్ చేశాను. రీ-రికార్డింగ్ కోసం మొత్తం 200 లైవ్ ఆర్కెస్ట్రా వాడాం. ఎందుకంటే అన్ని సంగీత పరికరాల శబ్దాలు ఒక్క కీ బోర్డ్‌లో పలకవు. అది చాలా అసహజంగా ఉంటుంది. పైగా ఖర్చుకు వెనుకాడకుండా లైవ్ ఆర్కెస్ట్రా ఐడియాను వెంటనే ఓకే చేశారు దర్శకుడు. రుద్రవీణతో పాటు ఈ సినిమా కోసం మొదటిసారిగా జిటార్ (ఎలిక్ట్రిఫైడ్ సితార్)ని ఉపయోగించాం. దీన్ని ప్రముఖ సంగీత విద్వాంసుడు నీలాద్రి వాయించడం విశేషం. ఈ సినిమాలో హీరో ఫ్లూటిస్ట్. రెండున్నర నిమిషాల పాటు వరంగల్‌లో హీరో మీద ఈ బిట్‌ను చిత్రీకరించారు. అది ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. ముఖ్యంగా హాంటింగ్ థీమ్ కోసం ఏడో తరగతి చదువుతున్న ఓ పాప చేత పాడించాం. అది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.
{పస్తుతం ఉన్న మ్యూజిక్ ట్రెండ్ మీద మీ అభిప్రాయం...?
ప్రేక్షకులు ఏ సంగీతాన్నైనా ఆస్వాదిస్తారు. మాస్, క్లాస్ ట్యూన్స్ అనే భేదాలు వాళ్లకి ఉండవు. కేవలం అవి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏర్పరచిన పరిధులు మాత్రమే. అంతే గానీ సంగీతాభిమానులకు అలాంటి అభిప్రాయాలుండవు. నేను 1986 నుంచి ఫ్లూటిస్ట్‌గా పని చేస్తున్నా. కె.వి.మహదేవన్ నుంచి కోటి, కీరవాణి వరకూ అందరి దగ్గరా పనిచేశాను. మణిశర్మతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో మేం సంగీతం మీద అవగాహన వస్తే గానీ దాని జోలికి వెళ్లే వాళ్లం కాదు. కానీ ఇప్పుడలా కాదు... రోజులు మారిపోయాయి. ల్యాప్‌టాప్ పట్టుకుంటే చాలు స్వరకర్తగా మారిపోతున్నారు.