సంగీతం వింటే ఫిట్స్ వచ్చే జబ్బు!
మెడి క్షనరీ
నిజానికి సంగీతం అంటే పిల్లలూ, పెద్దలతో పాటు మూగజీవాలూ పరవశిస్తాయని అంటారు. కానీ ఈ జబ్బు ఉన్నవాళ్లు సంగీతం వినగానే ఫిట్స్ వచ్చి పడిపోతారు. ఇలా వచ్చే ఫిట్స్‌ను ‘మ్యూజిక్ ఇండ్యూస్డ్ సీజర్స్’ అని పిలుస్తారు. అలాగే ఫిట్స్ ఇలాంటివే మరికొన్ని చిత్రమైన కారణాలతోనూ రావచ్చు. కొందరికి వేడినీళ్లు ఒంటి మీద పడ్డా ఫిట్స్ రావచ్చు మరికొందరిలో టీవీ తెరపై కనిపించే వెలుగులు లేదా మానిటర్ నుంచి వచ్చే కాంతితోనూ రావచ్చు. వేడినీళ్లు తలమీద గుమ్మరించుకోవడం వల్ల వచ్చే ఫిట్స్‌ను ‘హాట్‌వాటర్ ఎపిలెప్సీ’ అంటారు.
టీవీ నుంచి లేదా వీడియోగేమ్స్ ఆడేటప్పుడు కనిపించే కాంతి వల్ల వచ్చే ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. కొన్ని పెద్ద పెద్ద వేదికలపై కాంతిపుంజాలు కదిలేలా అమర్చే లైట్లు వెదజల్లే ఫ్లాష్ లైట్లతోనూ కొందరికి ఫిట్స్ రావచ్చు. చిన్నారులు, టీనేజీ పిల్లల్లో ఈ తరహా ఫిట్స్ ఎక్కువ. కొందరు బాణాసంచా వెలుగులను తట్టుకోలేక కూడా ఫిట్స్‌కు గురికావచ్చు. ఈ తరహా ఫిట్స్‌ను ఫొటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ న్యూరోఫిజీషియన్లు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) అనే పరీక్ష నిర్వహించి, వ్యాధి నిర్ధారణ చేసి, తగిన చికిత్స అందిస్తారు.