రేపు విశాఖ బీచ్ రోడ్డులో సంగీతకళానిధి
విశాఖ: విశాఖ జిల్లాలో బీచ్‌రోడ్డులో మంగళవారం సంగీత కళానిధి కార్యక్రమం జరగనున్నట్టు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత భాండాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 54 ఏళ్ల పాటు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాల్లో నిరాఘంటంగా నేదునూరి పాడిన కీర్తనలు సంగీత ప్రియుల కోసం భాండాగారంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. భాండాగారంలో 520 మంది వాగ్గేయ, 31,400 సంగీత విద్వాంసుల కీర్తనలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎల్. రాఘవన్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పప్పు వేణుగోపాలరావు సహకారంతో అందిస్తున్నామన్నారు. భారతదేశం సంగీత విద్వాంసుడి పేరుమీద భాండాగారం తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారి అని యార్లగడ్డ చెప్పారు. భాండాగారం ఏర్పాటుకు సాయమందించిన కార్పొరేషన్, మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.