ఒకటో తరగతిలోనే డ్రాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బడిలో చేరే ముస్లిం విద్యార్థుల్లో చాలా మంది మధ్యలోనే బడి మానేస్తున్నారు. సాంఘిక, ఆర్థిక కారణాలతో పాటు మైనార్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమ కారణంగా చిన్న వయసులోనే ముస్లిం విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఈయూపీఏ) రూపొందించిన తాజా నివేదికలో మధ్యలోనే బడి మానేస్తున్న ముస్లిం విద్యార్థుల తాజా గణాంకాలను పొందుపరిచింది.
ఈ నివేదికను ఎన్ఈయూపీఏ ఇటీవలే జాతీయ మైనార్టీ కమిషన్కు అందజేసింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో చదువుతున్న ముస్లిం బాలురు ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్లేలోపే 10 శాతం మంది బడి మానేస్తున్నారు. ముస్లిం బాలికలు మొదటి తరగతిలోనే 16 శాతం చదువు చాలిస్తున్నారు. ముస్లిం బాలురు రెండో తరగతిలో 5 శాతం, మూడో తరగతిలో 6 శాతం, నాలుగో తరగతిలో 5 శాతం మంది చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఐదో తరగతిలో ఏకంగా పదహారు శాతం మంది చదువు ఆపేస్తున్నారు. ఆరో తరగతిలో ఆరు శాతం, ఏడో తరగతిలో పదకొండు శాతం బడి మానేస్తున్నారు. ఒకటి, ఐదు, ఏడు తరగతుల్లో బడి మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం.
ఇలాఉండగా, జాతీయ స్థాయి గణాంకాల ప్రకారం.. దేశంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య.. ప్రాథమిక స్థాయిలో 14.2%, ప్రాథమికోన్నత స్థాయిలో 12.11%, సెకండరీ స్థాయిలో 9.05%, ఉన్నత విద్య స్థాయిలో 7.14% మంది ఉన్నారు. అంటే.. ప్రాథమిక పాఠశాలలకు వెళ్తున్న ముస్లిం విద్యార్థుల్లో సగం మంది మాత్రమే ఉన్నత విద్యను కొనసాగించగలుగుతున్నారు. మిగతా సగం మంది ఈ మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. దేశంలో ఉర్దూ మీడియం బడుల్లో చదువుతున్న ముస్లిం విద్యార్థుల సంఖ్య 3 శాతంలోపేనని ఎన్ఈయూపీఏ నివేదిక స్పష్టం చేయడం విశేషం..