మలాలాపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత, పాకిస్థాన్ అక్షర సాహసి యూసఫ్‌జాయ్ మలాలాపై దాడి అంతా ఓ భూటకం అని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ఆధారంగా చోటు చేసుకుందని పాకిస్థాన్ పార్లమెంటు నేత ముస్సారత్ అహ్మద్జేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ చానెల్ కోసం సిద్ధం చేసిన కథ ఆధారంగా 2012లో మలాలాపై దాడి సంఘటన చోటు చేసుకుందని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక తప్ప మరొకటి కాదంటూ ఎవ్వరూ ఊహించని విధంగా అన్నారు. ఆదివారం ఉమ్మత్ అనే ఓ ఉర్దూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మలాలా తలకు బుల్లెట్ తగిలింది.. కానీ ఏ బుల్లెట్ ఆమె తలలో ఉన్నట్లు సిటీ స్కాన్‌లో కనిపించలేదని స్వాట్‌లో స్కాన్ చేసినప్పుడు తెలిసింది. కానీ, పెషావర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో మాత్రం బుల్లెట్ ఆమె తలలో ఉంది’ అని అన్నారు. అంతేకాదు, ఆమెకు చికిత్స చేసిన వైద్యులను కూడా తీవ్రంగా నిందించారు. ఆ వైద్యులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇచ్చిందని చెప్పారు. బీబీసీలో చూపించినట్లుగా మలాలాకు అసలు చదవడం, రాయడం రాదని, ఒక అమెరికన్ మలాలా ఇంట్లో మూడు నెలలు ఉండి ఆమె నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అసలు ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఆమె మలాలా విషయంలో ఎందుకు ఇలా ఆరోపణలు చేశారో పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ముస్సారత్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్‌లో ఉన్నారు. ఈ పార్టీ నవాజ్ షరీఫ్ చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.