విద్యార్థులకూ ఆధార్
♦ అనుసంధానంతో కచ్చితమైన విద్యార్థుల సంఖ్య
♦ నత్తనడకన సీడింగ్.. సగటు 85 శాతం మాత్రమే నమోదు
నియోజకవర్గం : హిందూపురం
పాఠశాలల సంఖ్య : 263
మొత్తం విద్యార్థులు : 40,327 మంది
ఇప్పటివరకు సగటు సీడింగ్ : 85 శాతం మాత్రమే
మండలం విద్యార్థుల సంఖ్య పూర్తయిన శాతం
హిందూపురం : 27,677 90.7
లేపాక్షి : 9,150 97
చిలమత్తూరు : 7,500 70
సంక్షేమ పథకాలకే పరిమితమైన ‘ఆధార్’ అనుసంధానం విద్యా వ్యవస్థలోనూ అమలు చేయనున్నారు. విద్యాభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఆ స్థాయిలో ప్రయోజనాలు విద్యార్థులకు అందటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యను సేకరించి ఆన్లైన్లో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. హిందూపురం నియోజకవర్గంలోని 263 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 40,327 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 60 వేలకు పైగా చదువుతున్నారు. గతేడాది నుంచే ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలున్నా.. నేటి వరకు సగటు 85 శాతం మాత్రమే నమోదు చేసుకోగలిగారు. అయితే ఈ ఏడాది 100 శాతం ఆధార్ నమోదు పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు.
అక్రమాలకు అడ్డుకట్ట?
ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠ్యపుస్తకాలు మార్కెట్కు తరలిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అధికారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఆధార్ అనుసంధానంతో బడిబయట పిల్లల వివరాలు, పాఠశాల పనితీరు, ఉపాధ్యాయుల సామర్థ్యం బహిర్గతమవుతాయి. దీంతో విద్యావ్యవస్థలో అక్రమాలు, అలసత్వానికి అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా మరో పదిరోజుల్లో అనుసంధానం పూర్తి చేస్తామని ఎంఈఓ గంగప్ప తెలిపారు.
అక్రమాలు బయటపడుతాయి : యాసిర్ఖాన్, విద్యార్థిని తండ్రి, హిందూపురం
ఆధార్ అనుసంధానంతో మధ్యాహ్న భోజన పథకాల్లో జరుగుతున్న అక్రమాలు బయటపడుతాయి. గతంలో వందమంది విద్యార్థులు స్కూల్కు వస్తే 300 వరకు వస్తున్నట్లు సంఖ్యలు రాసుకుని ఏజెన్సీ నిర్వాహకులు అవినీతికి పాల్పడేవారు. ఆధార్ అనుసంధానం చేయడంతో అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.