ఫ్యాన్సీ సెల్ నెంబర్ల పేరుతో టోకరా
గోల్కొండ: ఫ్యాన్సీ నెంబర్లు గల మొబైల్ సిమ్‌కార్డులు ఇస్తానని అధిక మొత్తంలో డబ్బు తీసుకొని సెల్‌ఫోన్ వినియోగదారులకు టోకరా వేస్తున్న ఓ కేటుగాడిని గోల్కొండ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఇతడు ఇప్పటి వరకూ నగర వ్యాప్తంగా సుమారు వంద మందిని మోసం చేసినట్టు తెలిసింది. సోమవారం ఎస్ఐ పి.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ ముస్తఫా యాకుబ్(24) మొబైల్ వినియోగదారులకు ఫ్యాన్సీ నెంబర్లపై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలని పథకం వేశాడు.
మొదట నగరంలోని పలువురి ఫోన్ నెంబర్లు సేకరించాడు. వారికి ఫోన్ చేసి తన వద్ద ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీకి చెందిన ఫ్యాన్సీ సిమ్‌కార్డులున్నాయని, అధిక మొత్తం చెల్లిస్తే మీరు కోరుకున్న నెంబర్‌తో సిమ్‌కార్డు ఇస్తానని చెప్తాడు. ఫలానా చోటకు డబ్బు తీసుకురావాలని సూచిస్తాడు. వారు వెళ్లగానే సిమ్ కార్డుకు రూ. 5 వేలు నుంచి రూ. 7 వేల వరకూ తీసుకొని.. సిమ్‌కార్డు గల కవర్ ఇచ్చి వెళ్లిపోతాడు. కవర్‌ను విప్పి చూస్తే వేరే నెంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు ఉంటుంది. దాన్ని ఫోన్లో వేస్తే యాక్టివేట్ కూడా కాదు. దీంతో సిమ్‌కార్డు కొన్నవారు మోసపోయామని తెలుసుకుంటారు. గత ఆరు నెలలుగా యాకుబ్ అబిడ్స్, సంతోష్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలువురిని మోసగించాడు.
ఒకసారి సంతోష్‌నగర్ ఠాణా పరిధిలో పట్టుబడ్డ యాకుబ్.. సిమ్‌కార్డు కొన్న వారితో రాజీ చేసుకొని కేసు లేకుండా బయటపడ్డాడు. ఇదిలా ఉండగా, ఈనెల 4న హుమాయున్‌నగర్‌కు చెందిన మహెబూబ్ అలీకి యాకుబ్ ఫ్యాన్సీ నెంబర్ ఇస్తానని ఫోన్ చేసి.. రూ. 7 వేలకు బేరం కుదర్చుకున్నాడు. మరునాడు మహెబూబ్ అలీకి యాకుబ్ ఫోన్ చేసి టూంబ్స్ రోడ్‌లోని గోల్డెన్ ఫంక్షన్‌హాలు వద్దకు రమ్మన్నాడు. రూ.7 వేలు తీసుకొని సిమ్‌కార్డు ఉన్న కవరు ఇచ్చి బైక్‌పై వెళ్లిపోయాడు. తర్వాత అందులో తాను కోరుకున్న ఫ్యాన్సీ నెంబర్ లేకపోవడంతో మహెబూబ్ అలీ అదేరోజు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈనెల 14న రాత్రి యాకుబ్ టోలిచౌకీలో వేరే కస్టమర్ కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 8 సిమ్‌కార్డు అప్లికేషన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.