పుష్కరాలకు అందరూ సహకరించాలి
యాత్రికులకు ఇబ్బందులు కలగనీయవద్దు
పలుచోట్ల హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు అంగీకరించిన సంఘాలు
మంచినీటి సౌకర్యం ఏర్పాటు
పట్టణ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి
కోదాడ: ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కోదాడ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి , పట్టణ సీఐ రజితారెడ్డిలతో పాటు పలువురు వక్తలు కోరారు. మంగళవారం కోదాడలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో లారీ యజమానులకు,అటో డ్రైవర్లలకు, ప్రైవేట్ పాఠశాలల యజమానులతో జరిగిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోదాడ నుంచి మట్టపల్లి ఘాట్‌కు వెళ్లడానికి వేలాది వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పట్టణవాసులపై ఉందన్నారు. వారికి అన్ని విధాలుగా సహయ సహకారాలు అందించి కోదాడ వాసులను గుర్తుంచుకొనేలా వ్యవహరించాలన్నారు. అన్ని కంపెనీలు మెకానిక్‌లను అందుబాటులో ఉంచుతామని ఎక్కడైన వాహనం ఆగితే వెంటనే తమకు సమాచారం ఇస్తే మెకానిక్‌లను అక్కడికి పంపుతామని ఆయన తెలిపారు. అదే విధంగా హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెల్లడానికి కూడ భక్తులు కోదాడ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు.
నిబంధనలు పాటించాలి..
సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఈ 12 రోజులు ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వాహనాలను ఆపవద్దని, కొత్తగా వచ్చిన వారికి రూట్, ఘాట్ల సమాచారం అందించాలని కోరారు. పట్టణంలో ముఖ్యకూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. యాత్రికుల కోసం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడ ప్రతి రోజు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డు వెంట, ముఖ్య కూడళ్లల్లో మంచినీటి సౌకర్యం, హెల్ప్‌లైన్‌డెస్క్‌లను ఏర్పాటు చెయాలని కోరారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు జాస్తీ సుబ్బారావు, ఏటుకూరి రామారావు, రావెళ్ల సీతరామయ్య, అర్వపల్లి శంకర్, గుండపనేని నాగేశ్వరరావు, రాపోలు శ్రీనివాస్, బాణాల కోటిరెడ్డి, నర్సరాజు , అక్కిరాజు వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.