రామయ్యకు నేడు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి మరో అరుదైన ఉత్సవం జరిపించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ముత్యాలు పొదిగిన ఆభరణాలను స్వామి వారి మూర్తులకు అలంకరించి వారంలో ఒక రోజు ప్రత్యేక సేవను నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కె. పాండురంగారావు, మహాలక్ష్మి దంపతులు సుమారు రూ.5 లక్షల వ్యయంతో తయారు చేయించిన ముత్యాల ఆభరణాలను ఆదివారం దేవస్థానం అధికారులకు అందజేశారు.
మక్మల్ వస్త్రంపై ముత్యాలతో స్వామివారి కిరీటం, చక్రం, వస్త్రం, శంకులను తయారు చేయించారు. ఆభరణాలను స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉంచి అర్చకులు సంప్రోక్షణ జరిపించారు. నేటి నుంచి ప్రతి సోమవారం ఈ ఆభరణాలను స్వామి వారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముత్తంగి సేవగా అభివర్ణించే ఈ పూజల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా టికెట్ ధరలను నిర్ణయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.