దేవుడి భూముల కబ్జాపై విచారణ
విజయవాడ (వన్‌టౌన్) :
ముత్యాలంపాడులోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి చెందిన 4.76 ఎకరాల భూమి సింగ్‌నగర్ సమీపంలో ఉంది. దానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో సహాయ కమిషనర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని దాని నుంచి ఇతర అనుమతులకు సంబంధించిన కాగితాలను పుట్టించి 130 మందికి ప్లాట్లు వేసి విక్రయాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే సహాయ కమిషనర్ జారీ చేసినట్లుగా చెబుతున్న నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ నకిలీదని దేవాదాయ శాఖ చెబుతోంది.
పోలీసు శాఖ విచారణ ప్రారంభం..
స్థలానికి సంబంధించి అవినీతి బాగోతంపై ఫిర్యాదు అందుకున్న విజయవాడ గవర్నరుపేట పోలీసులు, ఇటీవల ‘సాక్షి’లో కథనం రావటంతో స్పందించారు. వెంటనే ఇక్కడి నుంచి బదిలీ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దుర్గాప్రసాద్‌ను నగరానికి రప్పించారు. జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయంలో ఆయనను సుమారు మూడు గంటలపాటు ఇటీవల విచారించారు. తాను జారీ చేసినట్లుగా చెబుతున్న ఆ ఉత్తర్వులు నకిలీవిగా దుర్గాప్రసాద్ పోలీసులకు స్పష్టం చేశారు. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సహాయ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన లేఖలోని రిఫరెన్స్ నంబర్ కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో అంశానికి సంబంధించినదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఎవరైతే సమాచార హక్కు చట్టం ద్వారా ఆ భూముల వివరాలను అడిగిన వ్యక్తి కూడా ఆ దరఖాస్తుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
కోర్టును ఆశ్రయించిన ఆక్రమణదారులు..
దేవాదాయ శాఖకు చెందిన సుమారు వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాన్ని సృష్టించి అమ్మకాలు చేస్తే దానిని స్వాధీనం చేసుకోవటానికి ఏమాత్రం వేగవంతమైన చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించి రెవెన్యూ శాఖకు, కలెక్టర్‌కు ఇప్పటి వరకూ ఫిర్యాదు చేయలేదు. అలాగే జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి రద్దు కోసం ప్రయత్నం చేయలేదు. దానితో పాటుగా నకిలీపత్రంతో సీఆర్డీఏ నుంచి పొందిన అనుమతులను కూడా రద్దు చేయించలేదు. అధికారుల సహకారంతోనే ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఆ స్థలానికి సంబంధించి న్యాయం చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు.
అధికారులపై చర్యల్లేవ్..
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దుర్గాప్రసాద్ తన కార్యాలయం నుంచి జారీ అయిన నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ నకిలీదని, దానితో తనకు సంబంధం లేదని చేతులు దులుపుకొని ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోయారు. అయితే అంత విలువైన స్థలం అన్యాక్రాంతమవుతుంటే సహాయ కమిషనర్‌గా ఉన్న అధికారి ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.