ఎలుగుబంటి దాడిలో వృద్ధుడి మృతి
వేమనపల్లి: వంట చెరకు కోసం అడవికి వెళ్లిన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని జాజులపేట గ్రామానికి చెందిన కోండ్ర ముత్తయ్య(65) శుక్రవారం ఎడ్లబండితో అటవీ ప్రాంతానికి వంట చెరకు కోసం వెళ్లాడు.
ఒక చోట బండి నిలిపి, ఎండిన కట్టెలు జమచేస్తున్నాడు. అటుగా వచ్చిన పిల్లల ఎలుగుబంటి ముత్తయ్యపై పైశాచికంగా దాడి చేసింది. ముత్తయ్య ప్రతిగా గొడ్డలితో దాడిచేసినా ఎలుగుబంటి వదిలిపెట్టలేదు. రాత్రి వరకూ ముత్తయ్య రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శనివారం అటవీ ప్రాంతంలో గాలించారు. కల్వలగెర్రె ప్రాంతంలోని ఒర్రెలో ముత్తయ్య శవమై కనిపించాడు.