నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు : డీఎంహెచ్ఓ
ముత్తుకూరు, న్యూస్‌లైన్: తెలిసీ తెలియని వైద్యంతో పేదలను మోసం చేసే నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు పెడతామని డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ హెచ్చరించారు. ముత్తుకూరు పీహెచ్‌సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు రోగులకు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలన్నారు. పరిధి దాటి ఆపరేషన్లు, నరాలకు సూదిమందులు ఇవ్వడం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మాతా శిశుమరణాలు పెరిగిపోయేందుకు వీరే కారణమన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
డీఎంహెచ్ఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయకుండా వైద్యులెవరూ ఆసుపత్రులు నిర్వహించకూడదన్నారు. మండలంలోని 11 హెల్త్ సబ్‌సెంటర్లకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. పిడతాపోలూరులో మరో ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ముత్తుకూరు పీహెచ్‌సీకి మరో డాక్టర్ పోస్టు మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఈదూరు సుధాకర్, క్లస్టర్ ఆఫీసర్ పురుషోత్తం, మెడికల్ ఆఫీసర్లు అమరేంద్రనాథ్‌రెడ్డి, నాగభూషణ్ పాల్గొన్నారు.
వైద్యశాల సీజ్ : ముత్తుకూరులో రిజిస్ట్రేషన్ లేని ఓ వైద్యశాలను డీఎంహెచ్ఓ తనిఖీ చేసి సీజ్ చేశారు. వెంటనే రిజిస్ట్రర్ చేసుకోవాలని వైద్యుడికి సూచించారు. డీఎంహెచ్ఓ తనిఖీలు తెలుసుకొని, కొందరు ఆర్ఎంపీలు వైద్యశాలలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.