mutton market
-
మటన్ వచ్చినా.. చికెన్ చిక్కదాయె?
విశాఖ సిటీ ,పెదవాల్తేరు: చికెన్ ధరలు తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన మటన్ వ్యాపారుల సమ్మె కారణంగా చికెన్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మటన్ అందుబాటులోకి వచ్చినా సరే చికెన్ ధరలు తగ్గకపోవడం మాంసాహారులకు మింగుడు పడడం లేదు. పలు కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నా సరే చికెన్ ధర మాత్రం మరో రూ.10 పెరగడం గమనార్హం. జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 1,300 వరకు చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా రోజుకు దాదాపుగా 10 వేల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో నమోదైన 750 వరకు మటన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల రోజూ 5 వేల కిలోల వరకు మటన్, మరో 250 దుకాణాల ద్వారా వెయ్యి కిలోల మటన్ విక్రయిస్తున్నారు. హనుమంతవాకలోని కబేళా తెరవాలని డిమాండ్ చేస్తూ విశాఖ మటన్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు సమ్మె చేసిన సంగతి తెలసిందే. సమ్మెకు ముందు, సమ్మె తరువాత కిలో మటన్ ధర రూ.600గానే ఉంది. సమ్మె కారణంగా చికెన్ కిలో ధర రూ.120 నుంచి రూ.140కి, స్కిన్లెస్ ధర రూ.130 నుంచి రూ.150కి పెరిగింది. వారు సమ్మె విరమించిన తర్వాత చికెన్ ధర మరో రూ.10 పెరిగింది. ప్రస్తుతం చికెన్ కిలో రూ.150, స్కిన్లెస్ ధర రూ.160గా ఉంది. ఇక ప్రైవేట్ కంపెనీల చికెన్ అయితే కిలో రూ.160, స్కిన్లెస్ ధర రూ.170కు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చికెన్ ధరలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. -
అంతా మా ఇష్టం
- నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కబేళాలు - నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు - ఆపదలో ప్రజారోగ్యం - మొద్దునిద్రలో అధికారులు అనంతపురం న్యూసిటీ : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కబేళాలను నిర్వహిస్తున్నారు. నగరంలోని మరువకొమ్మ కాలనీ, గుల్జార్‌పేట, కళ్యాణదుర్గం బైపాస్ సమీపంలో కబేళాలను ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ఇక గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ప్రతి వీధిలో చిల్లరకొట్లు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. పశువులను పరీక్షించకుండానే విక్రయిస్తున్నారు. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తప్పక పడుతుందని వైద్యులంటున్నారు. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన నగరపాలక సంస్థ, పశు శాఖ అధికారులు అటువైపు తొంగిచూడటం లేదు. ఇష్టానుసారంగా విక్రయాలు మరుకొమ్మ కాలనీ, గుల్జార్‌పేట, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతాల్లో ఆవులు, ఎద్దులను కోసి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇక్కడ వ్యాపారులు నిర్వహించే తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భగవంతుడా ఇటువంటి మాంసాన్ని తీసుకుంటారా అన్న ఆలోచన రాకమానదు. వెటర్నరీ వైద్యులు పరీక్షలు నిర్వహించకుండానే ఆవులు, ఎద్దులను వధిస్తున్నారు. సాధారణ నియమ నిబంధనలను అసలే పాటించడం లేదు. మరువకొమ్మ కాలనీకు అనుకుని కాలువ ఉంది. ఆవులు, ఎద్దుల రక్తం పారుతూనే కనిపిస్తుంటుంది. ఆరుబయట గోడలకు గోవులు, ఎద్దుల మాంసాన్ని తగిలేశారు. వాటిపై ఈగలు, దోమలు, బ్యాక్టీరియా వాలుతున్నా ఎవరికీ పట్టడం లేదు. కంపు మార్కెట్ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా పాతూరు మటన్ మార్కెట్ నిలుస్తోంది. మార్కెట్ ఆరుబయట నుంచి లోపల భాగంలో కంపు కొడుతోంది. గొర్రెలు, పొట్టేళ్లను అక్కడే వధించడంతో పాటు కాల్చుతుంటారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా విక్రయిచ్చేస్తున్నారు. మాంసం వ్యర్థలు, ఈగలు, దోమలతో ఎప్పుడూ అక్కడ అపరిశుభ్రత నెలకొంటోంది. అలాగే నగరంలతో కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న చాలా మాంసం దుకాణాలకు అసలు అనుమతులే లేవు. పట్టించుకోని అధికారులు పశుశాఖ, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ జరిపి మంచి మాంసాన్ని విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా జీవాలను వధించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ ఇటువంటి పరీక్షలు జరగకుండానే మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఒక్కచోటే ! నగరంలోని పశువైద్యశాల ప్రాంగణంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మటన్ మార్కెట్లోనే జీవాలకు వైద్య పరీక్షలు నిర్వహించి విక్రయిస్తున్నారు. వైద్యులు సైతం ఇటువంటి మాంసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది – ఇబ్రహీం, వ్యాపారస్తుడు వెటర్నరీ వైద్యులు గతంలో పరీక్షలు నిర్వహించే వారు. ఇప్పుడు ఇటువైపుకు రావడం లేదు. మేము పరీక్షలు నిర్వహించమనే అడుగుతున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏమైనా చెబితే కొట్టేందుకు వస్తారు – శేషోజీరావు, మటన్ మార్కెట్ లీజుదారుడు కబేళాలు ఎక్కడున్నాయ్. ఒక్కటీ లేదు. ఎటువంటి పరీక్షలు నిర్వహించరు. ఇష్టానుసారంగా గొర్రెలు, మేకలను కోసి అమ్ముతున్నారు. మునిసిపాలిటోళ్లు గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. మేము చెప్పేందుకు వెళితే కొట్టేందుకొస్తారు. -
రాజోలిలో దారుణహత్య
శాంతినగర్: వడ్డేపల్లి మండలం రాజోలిలో ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే మటన్ వ్యాపారి అమీర్ (30)ను ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో నరికి పారిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజోలికి చెందిన కటిక అమీర్ (30)మటన్ వ్యాపారం చేసేవాడు. ఏడాది క్రితం అమీర్‌కు వివాహమైంది. 2008లో జరిగిన ఇనుప సామాన్ల వ్యాపారి బాబుమియా హత్యకేసులో ప్రధాన నిందితుడు. అలాగే మరో కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులుగా గ్రామానికి చెందిన కొందరితో పేకాటకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో అమీర్ గొడవపడుతున్నాడని సమాచారం. ఈక్రమంలో గురువారం రాత్రి అతడు తన మటన్‌షాపు సమీపంలో నిలబడి ఉండగా, ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి అమీర్ తల నరకడంతో పాటు ఎడమ చేయి మణికట్టు వరకు కోసి, పరారయ్యాడు. హఠాత్తుగా జరిగిన సంఘటనతో మటన్ మార్కెట్ పరిసరాల్లో ఉన్న జనం భయపడ్డారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి, భార్య సంఘటన స్థలానికి చేరుకుని అమీర్ మృతదేహంపై పడి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించి పంచనామా నిర్వహించారు. గతంలో జరిగిన హత్యల నేపథ్యంలో హత్య చేశారా లేక పేకాట గొడవల వల్ల హత్యకు గురయ్యాడా అనే విషయంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అమీర్‌ను హత్య చేసిన నిందితుడు నేరుగా వెళ్లి రాజోలి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.