విశాఖ సిటీ ,పెదవాల్తేరు: చికెన్ ధరలు తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన మటన్ వ్యాపారుల సమ్మె కారణంగా చికెన్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మటన్ అందుబాటులోకి వచ్చినా సరే చికెన్ ధరలు తగ్గకపోవడం మాంసాహారులకు మింగుడు పడడం లేదు. పలు కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నా సరే చికెన్ ధర మాత్రం మరో రూ.10 పెరగడం గమనార్హం. జీవీఎంసీ పరిధిలో దాదాపుగా 1,300 వరకు చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా రోజుకు దాదాపుగా 10 వేల కిలోల వరకు చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో నమోదైన 750 వరకు మటన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల రోజూ 5 వేల కిలోల వరకు మటన్, మరో 250 దుకాణాల ద్వారా వెయ్యి కిలోల మటన్ విక్రయిస్తున్నారు.
హనుమంతవాకలోని కబేళా తెరవాలని డిమాండ్ చేస్తూ విశాఖ మటన్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు సమ్మె చేసిన సంగతి తెలసిందే. సమ్మెకు ముందు, సమ్మె తరువాత కిలో మటన్ ధర రూ.600గానే ఉంది. సమ్మె కారణంగా చికెన్ కిలో ధర రూ.120 నుంచి రూ.140కి, స్కిన్‌లెస్ ధర రూ.130 నుంచి రూ.150కి పెరిగింది. వారు సమ్మె విరమించిన తర్వాత చికెన్ ధర మరో రూ.10 పెరిగింది. ప్రస్తుతం చికెన్ కిలో రూ.150, స్కిన్‌లెస్ ధర రూ.160గా ఉంది. ఇక ప్రైవేట్ కంపెనీల చికెన్ అయితే కిలో రూ.160, స్కిన్‌లెస్ ధర రూ.170కు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చికెన్ ధరలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment