అచ్చమైన మిథునం
ఇటీవల ఓ వృద్ధ జంట జీవితాన్ని వెండితెరపై ‘మిథునం’ పేరిట అందమైన కావ్యంగా ఆవిష్కరించారు తనికెళ్ల భరణి. అటువంటి అచ్చమైన జంట స్థానికంగా ఒకరికిఒకరై తోడుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ చెక్కు చెదరని అనుబంధంతో మెలుగుతున్నారు. ఈ ఆదర్శ దంపతుల జీవితం... నిజ జీవిత మిథునం.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పాత లైబ్రరీ భవనం పక్కన 95 ఏళ్ల జొరిగే ముత్యాలు, 85 ఏళ్ల భార్య దుర్గమ్మ మేదర వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి సాగనంపారు. కుమారులెందరో పుట్టి మరణించడంతో ఓ బాలుడ్ని పెంచుకున్నారు. రెక్కలొచ్చాక ఆ బిడ్డకు ఎగిరిపోయాడు. దీంతో వృద్ధ దంపతులిద్దరూ ఒకరికి ఒకరై 60 ఏళ్లుగా పోలవరం మెయిన్రోడ్డుకి ఆనుకుని ఉన్న ఇంట్లో జీవించేవారు.
రహదారి విస్తరణలో ఈ ఇల్లు కూడా పోవడంతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్ల దీస్తున్నారు. భర్తకు స్నానం చేయించడంతో పాటు అన్నం తినిపించడం వంటి అన్ని పనులు భార్య దుర్గమ్మ చేస్తుంది. భర్త బుట్టలు అల్లుతుంటే సాయం అంది స్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోయినా ఈ జంట ఆనందంగా జీవనం సాగిస్తోంది.