గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం
సాక్షి, రాజమండ్రి :మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గత జూన్‌లో జరిగిన పైపులైను పేలుడు ఘటన అనంతరం, గ్యాస్ సరఫరాను క్రమేపీ పునరుద్ధరిస్తున్నట్టు గెయిల్ జనరల్ మేనేజర్ ఎంవీ అయ్యర్ చెప్పారు. రాజమండ్రిలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 5.2 మిలియన్ క్యూబిక్ మీటర్లకుగాను 4.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల సరఫరాను పునరుద్ధరించామన్నారు. ఇప్పటికే జీవీకే, స్పెక్ట్రమ్ తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సరఫరా పునఃప్రారంభమైందన్నారు. తమవద్ద నుంచి 37 చిన్న సంస్థలు గ్యాస్ సరఫరా పొందుతున్నాయని, వీటిల్లో 23 సంస్థలకు గ్యాస్ సరఫరాను తిరిగి ప్రారంభించామని చెప్పారు. వారం రోజుల్లో మరో నాలుగైదు కంపెనీలకు, 15 రోజుల్లో పూర్తిస్థాయిలోను గ్యాస్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. నగరం పరిసర ప్రాంతాల్లో స్థానికుల కోసం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నగరం పైపులైను పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైందని, బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు గెయిల్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తమ పైపులైన్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరిచేందుకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు.
600 పాఠశాలల్లో మరుగుదొడ్లు
సామాజిక బాధ్యతలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 600 బాలికల పాఠశాలల్లో రూ.12 కోట్లతో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని అయ్యర్ తెలిపారు. రెండు జిల్లాల్లోనూ 40 ఆర్వో ప్లాంట్ల కోసం ప్రతిపాదన లు సిద్ధం చేశామన్నారు. నగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.50లక్షలు అందిస్తున్నామని, ఇందులో రూ.20లక్షలు ఇప్పటికే చెల్లించామని చెప్పా రు. సమావేశంలో గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎల్.ఆర్ముగం, ఆశిష్ యాదవ్, మరో అధికారి విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.