23న ఇంటర్ ఫస్టియర్, 26న సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఈనెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ముందుగా ఈనెల 23న ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని, ఆ తరువాత రెండు, లేదా మూడు రోజుల్లో సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ సాక్షి’తో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి మూడో తేదీ నుంచి ప్రారంభమై మార్చి 21తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మూల్యాంకనం అనంతరం విద్యార్థుల కేటగిరిల వారీగా మార్కులను కంప్యూటరీకరించడం, మార్కుల మెమొరాండమ్ల రూపకల్పన తదితర ప్రక్రియలను పూర్తి చేయించి మొదటి సంవత్సరం ఫలితాలను ఈనెల 23న విడుదల చేస్తారు.
తరువాత రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీలకు మార్చి 29 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. అయితే ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రవేశాలు చేపట్టడంతో పాటు తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. ఇలా సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి సత్యనారాయణ హెచ్చరించారు.