ప్రగతిబాట సాగుదాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ప్రజల సంపూర్ణ ఆర్థిక, సామాజిక అభివ ృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. 65వ గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 9గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయజెండాను ఆవిష్కరించారు. పోలీసు దళాల నుంచి ఎస్పీ వి.శివకుమార్‌తో కలిసి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్ధేశించి 26 నిమిషాల పాటు సందేశమిచ్చారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి గురించి సోదాహరణంగా వివరించారు.
- న్యూస్‌లైన్, కలెక్టరేట్
గ్రామ సందర్శనతో ముందుకు..
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా జిల్లాలో గ్రామసందర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 23 విడతలుగా 1,300 పంచాయతీలలో, 481 వార్డులలో గ్రామసందర్శన జరిపామన్నారు. ప్రజల నుంచి 1,39,485 అర్జీలను స్వీకరించి, 1,03,864 అర్జీలను పరిష్కరించామన్నారు. మిగిలినవి పరిష్కారదశలో ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయం
రబీ సీజన్లో 2,17,956 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధంగాా ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఈ సీజన్లో రూ.500 కోట్ల పంట రుణాలను లక్ష్యంగా నిర్ణయించి, ఇప్పటివరకు రూ.247 కోట్ల రుణాలను రైతులకు పంపిణీ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా యంత్రలక్ష్మి పథకం కింద 50 శాతం రాయితీతో రూ.11.10 కోట్లతో యంత్ర పనిముట్లు అందజేసినట్లు తెలిపారు. ఆర్ఐడీఎఫ్ పథకం కింద జిల్లాకు విడుదలైన రూ.19.57 కోట్లతో నూతన పశువుల ఆస్పత్రుల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు.
విద్య
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా జిల్లాలోని 45 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల విద్యాబోధన చేస్తున్నామన్నారు. 3,052 పాఠశాలల్లోని 2,62,738 మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నామన్నారు. 3,416 అంగన్వాడీకేంద్రాలు, 574 వసతిగృహాలలో విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
వైద్యం
గ్రామాలు, పట్టణాలలో అధికారుల ృందాలు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసి పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించి మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలలో డెంగీ, విషజ్వరాలు, అతిసార వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
యువతకు స్వయం ఉపాధి
ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్, వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 12,878 మంది యువతకు రూ.53.14 కోట్ల సబ్సిడీతో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, ఫిబ్రవరిలోనే యూనిట్లు బ్యాంకు రుణాలతో కలిపి గ్రౌండింగ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.17.86 కోట్ల సబ్సిడీతో 5,155 మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.30 కోట్ల సబ్సిడీతో 6,594 మందికి, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.3.8 కోట్ల సబ్సిడీతో 783 మందికి, ట్రైకార్ ద్వారా రూ.1.36 కోట్ల సబ్సిడీతో 316 మందికి, వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా రూ.12 లక్షల సబ్సిడీతో 30 మందికి వివిధ రకాల యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ విధిగా ఓటరుగా నమోదకు కావాలని కలెక్టర్ కోరారు. 38,88,673 మంది జిల్లా జనాభాలో 67 శాతం ఓటర్లుగా నమోదయ్యేందుకు విసృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలలో ఓటర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
సమగ్ర పారిశుధ్య పథకం కింద 2014 మార్చి వరకు సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో రూ.227 కోట్ల అంచనాలతో 2,49,435 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసి రూ.60.36 కోట్లు లబ్ధిదారులకు చెల్లించామన్నారు.
జిల్లాలో లో ఓల్టేజీ నివారణకు కొత్తగా 36 సబ్స్టేషన్లను ప్రభుత్వం మంజూరీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
తెల్లకార్డుదారులకు ఆడబిడ్డ పుడితే కళాశాల చదువు పూర్తిచేసేంతవరకు బంగారుతల్లి పథకంతో బాసటగా నిలుస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ పూర్తి చేసుకునేవరకు ప్రభుత్వం ద్వారా రూ.2.5లక్షల ఆర్థిక సాయం అందుతుందన్నారు.
ప్రతినెల 8,60,162 తెల్లకార్డుదారులతోపాటు 1,45,147 అంత్యోదయ అన్నయోజన కార్డులపై రూపాయికే కిలోబియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అమ్మహస్తం పథకం ద్వారా రూ.185లకే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.
ఉపాధిహామీ పథకంలో భాగంగా 27,862 శ్రమశక్తి సంఘాలకు 6.88 లక్షల జాబ్‌కార్డులు జారీ చేసి 2.58 లక్షల కుటుంబాలకు పనిదినాలు కల్పించామన్నారు.
చేనేత జౌళిశాఖ ద్వారా జిల్లాలో మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీపై విద్యుత్ సరఫరాకు రూ.26 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలోనే మొదటిసారిగా 38 వేల మరమగ్గాల ఆధునికీరణకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో పర్యాటక శాఖ ద్వారా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాల్లో రూ.12 కోట్లతో రెస్టారెంట్లు, అతిథిగృహాల నిర్మాణాల పనులు ప్రారంభించామన్నారు. ఎలగందుల ఖిల్లాపై సౌండ్, లైటింగ్ అభివృద్ధి పనులకు రూ.4.62 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఐఏపీ కింద నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాల అభివృద్ధికి 2013-14 సంవత్సరానికి రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాన్నారు. ప్రతిపాదనలు కోరి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఐకేపీ ద్వారా స్వశక్తి సంఘాల మహిళలకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.599.87 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం కాగా, 9,400 సంఘాలకు రూ.300 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామన్నారు. 97 శాతం రుణాల రికవరీలో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజావాణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు 1,74,304 అర్జీలు రాగా, 1,66,254 అర్జీలను పరిష్కరించామని కలెక్టర్ వివరించారు.
ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు జేసీ ఎ.మనోహర్, డీఆర్వో కృష్ణారెడ్డితోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
-న్యూస్‌లైన్, కలెక్టరేట్