మునగ గింజలతో ‘మంచి’ నీరు
సాక్షి, విజయవాడ బ్యూరో: క్లోరినేషన్ చేయకుండా, వాటర్ ఫిల్టర్ ఉపయోగించకుండా కేవలం మునగ గింజలతో నీటిని శుద్ధి చేసే విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలతో బురద నీటిని సైతం శుద్ధిచేసి తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు.
ఇదీ విధానం..: ఎండిన గింజలను కాయ నుంచి వేరుచేసి అందులోని పప్పును మెత్తని పిండిగా చేయాలి. దాన్ని శుభ్రమైన నీటిలో కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దానికి తగినంత నీరు కలిపి పలుచగా తయారుచేయాలి. పాల మాదిరి తెల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని అపరిశుభ్రంగా ఉన్న నీటిలో వేసి అర నిమిషంపాటు వేగంగా కలపాలి. తర్వాత ఐదు నిమిషాల వరకూ నెమ్మదిగా.. నిమిషానికి 15 లేక 20 సార్లు కలపాలి. అనంతరం నీటిపై మూతపెట్టి ఒక గంట వరకు వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వడగట్టుకోవాలి. ఒకవేళ నీటిని కదిపితే ఫలితం ఆలస్యమవుతుంది. సాధారణంగా పెద్ద బకెట్లో పట్టే నీటిని శుభ్రపరిచేందుకు రెండు టీ స్పూన్ల (ఐదు మిల్లీమీటర్లు పట్టేవి) మునగ గింజల పౌడర్ అవసరం. ఈ పద్ధతితో నీటిలోని బ్యాక్టీరియా కూడా పోతుంది. దీని వల్ల నీటి పీహెచ్ ఏమాత్రం మారదు. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలు కావడంతో దీనివల్ల ఎటువంటి హాని కలగదు.