రైలు కిందపడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ముషీరాబాద్: అదృశ్యమైన తల్లీ కూతూళ్ల కోసం ఓ వైపు ముషీరాబాద్ పోలీసులు గాలింపు చేస్తుండగానే మరో వైపు వారి మృతదేహాలు ఘట్కేసర్ వద్ద రైల్వే ట్రాక్‌పై లభ్యమయ్యాయి. అత్తింటివారి వేధింపులు తాళలేక ఆమె కూతురుతో కలసి బలవర్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పెళ్లయిన మూడేళ్లకే తమ కుమార్తెను అత్తింటివారు పొట్టన పెట్టుకున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గాంధీనగర్‌లో మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్యాంప్రసాద్, స్వప్న (24) దంపతులు. మూడేళ్ల కిందట వీరికి వివాహమైంది. వీరికి శాన్వి (20 నెలలు)అనే కూతురు, అక్షద్ (10 నెలలు)కుమారుడు సంతానం. శ్యాంప్రసాద్ తల్లి ప్రమీల, ఆడబిడ్డలు కళ్యాణి, ప్రవీణ కూడా వీరితోనే ఉంటున్నారు. శ్యాంప్రసాద్ రిలయన్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. స్వప్న సోమవారం ఉదయం అక్షద్ను అత్తకు అప్పగించి శాన్విని తీసుకుని పక్కనే ఉన్న మోర్ సూపర్ మార్కెట్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. శ్యాం యధావిధిగా డ్యూటీకి వెళ్లాడు. ఉదయం 11.30 గంటలకు వెళ్లిన స్వప్న సాయంత్రం నాలుగు గంటలైనా తిరిగి రాలేదు.
విషయం తెలుసుకున్న భర్త ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్ అన్ని పోలీసు స్టేషన్లకు సమాచా రం అందించారు. ఒకపక్క తల్లికూతుర్ల కోసం పోలీసులు గాలిస్తుండగానే తల్లీకూతుళ్లు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చర్లపల్లి - ఘట్కేసర్ మధ్యలోని యానంపేట రైల్వే ట్రాక్‌పై శవమై తేలారు. వీరి మృతదేహాలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు మార్చురీలో ఉన్న మృతదేహాలను శ్యాంప్రసాద్‌కు చూపించారు. అవి తన భార్య, కూతురుగా గుర్తించారు. చర్లపల్లి - ఘట్కేసర్ మధ్యలో యానంపేట రైల్వే ట్రాక్‌పై ఘట్కేసర్ నుంచి వేగంగా వస్తున్న రైలుకు అడ్డంగా ముందు తన పాపను నిలబెట్టి, రైలు దగ్గరకు వచ్చిన సమయంలో తాను కూడా రైలు పట్టాలపై దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు రైల్వే ఎస్ఐ రామారావుకు తెలిపారు.
అత్త, ఆడబిడ్డల వేధింపులే.....
అత్త, ఆడబిడ్డల వేధింపులే తన బిడ్డ, మనవరాలిని బలితీసుకున్నాయని మృతురాలి తల్లి మేఘమాల సాక్షితో చెప్పి రోదించింది. ఇటీవల దసరా పండుగకు వరంగల్ జిల్లా బచ్చనపేటలోని తమ ఇంటికి వచ్చి వెళ్లిందని ఆమె తెలిపింది. బీటెక్ చదువుకున్న తన కూతురును అన్యాయంగా అత్తింటివారు పొట్టనపెట్టుకున్నారని ఆమె ఆరోపించింది.
మోన్న గురుప్రసాద్ నేడు స్వప్న.....
భార్య మీది కోపంతో ప్రొఫెసర్ గురుప్రసాద్ ఇటీవలే తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన నగర ప్రజలు మరవకముందే అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి అత్త, ఆడబిడ్డలపై కోపంతో స్వప్న తన 20 నెలల కూతురితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సంఘటలు వరుసగా చోటుచేసుకోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు ఘటనల్లో కూడా పిల్లల్ని హత మార్చింది విద్యావంతులైన ఉండడం గమనార్హం. ఒకరిపై ఉన్న కోపం తమ కన్న బిడ్డలను బలి తీసుకోవడం ఎంత వరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.