హౌరా-మైసూర్ ప్రత్యేక రైలు నుంచి పొగలు
తుని, న్యూస్‌లైన్: హౌరా నుంచి మైసూర్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలులో శనివారం ఉదయం పొగలు వచ్చాయి. విశాఖ జిల్లా గుల్లిపాడు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత బీ-1 ఏసీ బోగీ అడుగుభాగం నుంచి పొగలు రావడాన్ని పాయకరావుపేట 451 రైల్వే గేట్‌మన్ రమణ గమనించి తుని స్టేషన్ సూపరింటెండెంట్ శర్మకు సమాచారమిచ్చారు. దాంతో రైలును తుని స్టేషన్లో నిలిపివేసి అగ్నిమాపక పరికరాలతో బోగీ అడుగున స్ప్రే చేశారు. ఏసీ మెషీన్లకు విద్యుత్ సరఫరా చేసే డైనమో బెల్టు పట్టివేయడం వల్ల పొగలు వచ్చాయి. దీనివల్ల విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలురైళ్లు ఆలస్యంగా నడిచాయి.
ఫలక్‌నుమాలో కూడా..
నందిగాం/పలాస: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో కూడా శనివారం మంటలు రేగాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు బయలుదేరింది. పూండి సమీపంలోకి వచ్చేసరికి ఎస్-5, 6 బోగీల కింది భాగంలో మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న డ్రైవర్ రైలును రౌతుపురంలో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంవల్ల మంటలు రేగినట్లు తేలింది. మరమ్మతుల అనంతరం రైలు బయల్దేరింది.