రూ.200 కోసం హత్య
వీడిన డ్రైవర్ మర్డర్ కేసు మిస్టరీ
హత్యకు పాల్పడిన తాగుబోతు రిమాండ్
మియాపూర్, న్యూస్‌లైన్: ఐడీఏ బొల్లారం రోడ్డులో ఈనెల 11న వెలుగు చేసిన డ్రైవర్ హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. హతుడి వద్ద ఉన్న రూ. 200, సెల్‌ఫోన్ కోసం ఓ తాగుబోతు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి, సోమవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ పురుషోత్తం కథనం ప్రకారం... కర్ణాటకలోని సుప్తాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ అలియాస్ జగదీశ్ (38) కుటుంబ సభ్యులతో కలిసి మియాపూర్ రెడ్డికాలనీలో ఉంటూ.. విజయ లాజిస్టిక్స్ ట్రాన్స్‌ఫోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఈనెల 10న జీతం రావడంతో భార్యకు రూ. 8500 ఇచ్చి.. రూ. 1500 తన జేబులో పెట్టుకున్నాడు. మియాపూర్ వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తూ మద్యం బాటిల్ తీసుకొనేందుకు సత్య వైన్స్ వద్ద ఆగాడు. ఇదిలా ఉండగా.. జగద్గిరిగుట్టకు చెందిన ఎండీ ఇర్ఫాన్ (23) డ్రైవర్. మద్యానికి బానిసైన ఇతను రాత్రి వేళ్లల్లో వైన్స్ వద్ద తిష్టవేసి.. అతిగా మద్యం తాగి వెళ్లే వారిని గుర్తించి వారిపై దాడి చేసి డబ్బులు లాక్కోవడం ప్రవృత్తిగా చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ రాత్రి అతిగా మద్యం తాగి ఉన్న జగదీశ్‌ను సత్య వైన్స్ వద్ద గమనించి.. ఐడీఏబొల్లారం రోడ్డులోని ఎమ్మార్ఎఫ్ వరకు అతడిని అనుసరించాడు. ఇర్ఫాన్ అక్కడ జగదీశ్ వద్ద ఉన్న పర్సు లాక్కోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ కత్తితో జగదీశ్‌ను పొడి చంపి.. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పర్సులో ఉన్న రూ. 200 తీసుకుని పారిపోయాడు.
దొంగిలించిన సెల్‌ఫోన్‌ను చందానగర్‌లో పరుశురామ్ అనే వ్యక్తికి రూ. 600కు విక్రయించగా.. అతను సలీం అనే మరో వ్యక్తికి అమ్మేశాడు. కాగా, 11వ తేదీ ఉదయం ఎమ్మార్ ఎఫ్ వద్ద మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో లభించిన డ్రైవింగ్ లెసైన్స్ ఆధారంగా హతుడు జగదీశ్‌గా గుర్తించారు.
ఎత్తుకెళ్లిన సెల్‌ఫోన్ ఈఎంఈఐ నెంబర్ ఆధారంగా నిందితుడు ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. 15 రోజుల్లోనే కేసును ఛేదించిన ఎస్సై వెంకటేశ్, జమీందార్ మల్లేష్, కానిస్టేబుల్ మహేశ్, ప్రభాకర్‌లు సీఐ పురుషోత్తం అభినందించారు.