ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: మురికి కాలువలు నిర్మించిన ఓ కాంట్రాక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిబడిన సంఘటన జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. మెదక్, నిజమాబాద్ జిల్లాల ఏసీబీ డీఎస్పీ ఎన్. సంజీవరావు కథనం మేరకు.. మెదక్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామానికి 2012లో బీఆర్జీఎఫ్ కింద రూ. 60 వేలు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామంలో మురికికాలువలు నిర్మించాల్సి ఉండగా అదే గ్రామానికి చెందిన కమ్మరి జయరాములు కాంట్రాక్ట్ పొంది మురికికాలువలు నిర్మించారు. దీనికి సంబంధించిన బిల్లు (ఎంబీ) రికార్డు చేసేందుకు ఆ గ్రామ ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు సదరు కాంట్రాక్టర్‌ను రూ. 5 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తర్వాత ఇస్తానని ముందు రికార్డు చేయాలని చెప్పటంతో రూ. 50 వేల చెక్‌ను ఈఏడాది జూలై 3న జయరాములుకు అందించారు. కాగా బ్యాలెన్స్ ఉన్నమరో రూ.10 వేలను ఇవ్వాలంటే లంచం గా తనకు రూ.5 వేలు చెల్లించాల్సిందేనని కార్యదర్శి పట్టుబట్టా రు. దీంతో చేసేదిలేక కాంట్రాక్టర్ మంగళవారం ఏసీబీ డీఎస్పీ ఎన్. సంజీవరావును ఆశ్రయించారు. దీంతో వారి సూచన మేర కు మధ్యాహ్నం కాంట్రాక్టర్ జయరాములు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు కార్యాలయంలో రూ. 4,500 లంచం ఇచ్చారు. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు.
వేధింపులు భరించలేకే..
లంచం కోసం నిత్యం వేధింపులకు గురిచేయటంతో ఏసీబీని ఆశ్రయించానని కాంట్రాక్టర్ కమ్మరి జయరాములు తెలిపారు.
అవినీతిపరులను వదిలేదిలేదు...
అవినీతి పరులు ఎంతటివారైనా వదిలేది లేదని ఏసీబీ డీఎస్పీ ఎన్ సంజీవరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంపై ఎంపీడీఓను సైతం ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తనకు 9440446155 ఫోన్‌చేసి వివరాలు తెలపాలని ఆయన కోరారు.