ఇన్చార్జి ఎస్పీగా వెంకటస్వామి
జిల్లా ఇన్చార్జి ఎస్పీగా ఎన్.వెంకటస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన రెమా రాజేశ్వరి పాలేరు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీగా ఎన్.వెంకటస్వామి బాధ్యతలు తీసుకున్నారు. - వికారాబాద్
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి ఎస్పీగా ఎన్.వెంకటస్వామి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన రెమా రాజేశ్వరిని పాలేరు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో ఆమె జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్.వెంకటస్వామికి బాధ్యతలను అప్పగించారు. రెమా రాజేశ్వరి గత ఏడాది నవంబర్‌లో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.దాదాపు 5 నెలల కాలంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి అటు ఉన్నతాధికారులతో పాటు జనం నుంచి మన్ననలు పొందారు. కేసులను త్వరితగతిన పరిష్కరించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనాథపిల్లలను గుర్తించి వారికి మంచి భవిష్యత్‌ను అందించేలా చర్యలు తీసుకున్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో తనదైన పాత్ర పోషించారు. వాట్సాప్ ద్వారా జిల్లాలో ఎప్పటికప్పుడు ఏఏ సంఘటనలు జరుగుతున్నాయి.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించారు. దీంతోపాటు మహిళల ర క్షణ విషయంలో ప్రత్యేక దృష్టిని సారించారు రెమా రాజేశ్వరి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు ఆమె కృషి చేశారు.
గాడి తప్పిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. జిల్లాలో అధికారికంగా 85 బాల్య వివాహాలను నిలిపివేయడం తను చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చదివించి ప్రయోజకుల్ని చేయాలని కోరారు.