అమరేశ్వరుని గాలిగోపురం పునాదుల్లో బౌద్ధ శిల్పాలు
అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరుని ఆలయ గాలిపోపురం పునాది తవ్వకాల్లో బుధవారం అపురూపమైన బౌద్ధ శిల్పాలు వెలుగుచూశాయి. దాదాపు రెండున్నర శతాబ్దాల కిందట నిర్మించిన ఈ గాలిగోపురాన్ని కూల్చి నూతనంగా నిర్మించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. గురువారం నూతన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది.
బుధవారం పునాది తవ్వుతుండగా లభించిన ఈశిల్పాల సమాచారం తెలుసుకున్న స్థానిక పురావస్తుశాఖ మ్యూజియం ఇన్చార్జ్ ఎన్.వెంకటేశ్వరరావు వాటిని పరిశీలించారు. బౌద్ధశిల్పాలుగా గుర్తించి ఆలయ అధికారులతో చర్చించిన అనంతరం మ్యూజియానికి తరలించారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ ప్రతినిధి ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తవ్వకాలలో లభించిన శిల్పాలు అరుదైనవని, 3వ శతాబ్దం కాలంనాటివన్నారు.