చిన్న సినిమాకి చిరు ప్రశంస
‘‘మోషన్ పోస్టర్ చాలా క్యూట్‌గా ఉందని చిరంజీవిగారు నన్ను ప్రశంసించడం జీవితంలో మరచిపోలేని క్షణం. చిరంజీవిగారు మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో మా చిన్న సినిమా పెద్ద చిత్రమైపోయింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తాం. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని దర్శకుడు అయోధ్య కార్తీక్ అన్నారు. మత్స్య క్రియేషన్స్ – పి.ఎల్.కె. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇది మా ప్రేమకథ’.
అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా ‘యాంకర్’ రవి హీరోగా పరిచయం అవుతున్నారు. మేఘనా లోకేష్ కథానాయిక. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను శనివారం చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా చిత్రం ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇప్పుడు మోషన్ పోస్టర్‌ను ఏకంగా చిరంజీవిగారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె. రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడగొంట్ల.