థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఫుల్ హ్యాపీ!
‘‘ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూశామనీ, కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇచ్చారనీ అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది’’ అని నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆయన నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్ల షేర్ని క్రాస్ చేయడం ఆనందంగా ఉందని బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. మరికొన్ని విశేషాలను శనివారం పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు.
మొదటి రోజు ఈ చిత్రానికి డివెడైడ్ టాక్ వచ్చింది. కానీ, ఎన్నో సినిమాలు తీసిన నిర్మాతగా సినిమా ఎప్పుడు నిలబడుతుందనే విషయం మీద నాకు అవగాహన ఉంది. అందుకని కంగారుపడలేదు. నా నమ్మకం నిజమైంది. డివెడైడ్ టాక్ వచ్చినప్పటికీ చూసినవాళ్లందరూ బాగుందనడంతో సినిమా నిలదొక్కుకుంది. ఎన్టీఆర్ నటన బాగుందని అందరూ అంటున్నారు. మంచి సినిమా తీశాడని సుకుమార్‌ని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమించారు కాబట్టే, మంచి వసూళ్లు దక్కాయి.
♦ సినిమా చూసినవాళ్లలో కొంతమంది హైదరాబాద్‌లో కూడా తీయొచ్చ న్నారు. కానీ, కథానుగుణంగానే లండన్‌లో తీశాం. కథకు తగ్గ లొకేషన్ అనీ, అక్కడ తీయడం వల్లే కథ ఎలివేట్ అయ్యిందనీ చాలామంది అన్నారు. సినిమా మొత్తం చాలా గ్రాండ్‌గా ఉందని కూడా ప్రశంసించారు.
♦ చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఈ మధ్య నేను ‘దోచెయ్’ అనే మీడియమ్ బడ్జెట్ సినిమా తీశాను. అది పెద్దగా ఆడలేదు. ఏ సినిమాకైనా దర్శకుడు, హీరో కాంబినేషనే ముఖ్యం. ఆ కాంబినేషన్‌కి బలమైన కథ కుదిరితే సినిమా నిర్మాణం మొదలవుతుంది. సో... కథ కన్నా కూడా ముందు కాంబినేషన్ సెట్ అవ్వాలి.
♦ అందరు హీరోలూ నాతో చాలా బాగుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్. మా సంస్థలో ఏ సినిమా తీసినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం. అందుకే అనుకున్న సమయానికి విడుదల చేస్తాం. ప్లానింగ్ విషయంలో మా అబ్బాయి బాపినీడుని అభినందించాల్సిందే. నిర్మాతగా నాది 30 ఏళ్ల ప్రయాణం. 1986 సంక్రాంతికి ‘డ్రైవర్ బాబు’ రిలీజైతే, ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ వచ్చింది. ఈ థర్టీ ఇయర్స్ అయామ్ వెరీ హ్యాపీ.
♦ ‘అత్తారింటికి దారేది’ పారితోషికం విషయంలో నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య వచ్చింది చిన్న సమస్య. త్వరలోనే అది పరిష్కారం అవుతుంది. కుదిరితే నెక్ట్స్ సినిమా కూడా పవన్‌కల్యాణ్‌తో చేయొ చ్చేమో. ప్రస్తుతం ముగ్గురు హీరో లతో సంప్రతింపులు జరుపుతున్నా. ఎవరితో చేస్తానో త్వరలో చెబుతా.